రాహుల్తో సీఎం, పీసీసీ చీఫ్ భేటీ

రాహుల్తో సీఎం, పీసీసీ చీఫ్ భేటీ
  • గ్లోబల్​ సమిట్, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ అభినందనలు
  • మెస్సీ మ్యాచ్ చూసిన అనంతరం ఢిల్లీకి బయల్దేరిన రాహుల్  

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా ప్యాలెస్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌‌‌‌‌‌‌‌ బాల్ మ్యాచ్  చూసేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన రాహుల్ కు శంషాబాద్ ఎయిర్​పోర్టులో రేవంత్, మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం రాహుల్ తో పాటే ఒకే కారులో సీఎం, పీసీసీ చీఫ్ ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే రాహుల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని రాహుల్ కు సీఎం వివరించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమిట్ సక్సెస్ అయిన తీరును, అంచనాలకు మించి పెట్టుబడులు వచ్చిన విషయాన్ని రాహుల్  దృష్టికి తీసుకెళ్లారు. 

కొత్త డీసీసీ చీఫ్ ల నియామకం, వారి పనితీరు, ఆదివారం ఢిల్లీలో జరగనున్న ఓట్ చోర్​ ధర్నాకు ఏర్పాట్లు, పది లక్షల సంతకాల సేకరణ, వాటిని ఏఐసీసీ కార్యాలయానికి పంపించిన విషయాన్ని రాహుల్ కు పీసీసీ చీఫ్ వివరించారు. దీంతో సీఎం, పీసీసీ చీఫ్ పనితీరుపై రాహుల్ సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించినట్టు తెలిసింది. 

ఇదే సమన్వయంతో రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని రేవంత్, మహేశ్ గౌడ్ కు రాహుల్ సూచించారు. అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియానికి ఒకే కారులో రాహుల్, రేవంత్, మహేశ్ గౌడ్ వెళ్లారు. స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ను చూసిన తర్వాత రాహుల్.. శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు.