గోదావరి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్

గోదావరి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేష్ కుమార్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. భద్రాచలంలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున అన్ని ప్రభుత్వ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా అదనపు కంటింజెంట్‌ ప్లాన్‌ రూపొందించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు.

భద్రాచలం వద్ద రేపటివరకు నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని..ఈ నేపథ్యంలో ముంపుకు గురయ్యే అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని సీఎస్ ఆదేశించారు. ఇప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని అరికట్టడం పట్ల అభినందనలు తెలిపారు. జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని అదనపు పరిమాణంలో కొనుగోలు చేసి, వాటిని వ్యూహాత్మక పాయింట్లలో ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వరద బాధిత జిల్లాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయ, పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.