
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జిల్లా పోలీసు ఆఫీసులో వివరాలను ఎస్పీ శ్వేత మీడియాకు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన ఎస్ కె. నజీర్ పెయింటర్‌గా పని చేస్తుంటాడు. ఇతని భార్య యాస్మిన్ అలియాస్వసీమా బేగం, వీరికి పరిచయమున్న షబానా బేగం ఇళ్లలో పని చేస్తుంటారు. ఖర్చులకు డబ్బులు సరిపోక చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి అవసరమున్నవారికి అమ్మేందుకు ముఠాగా ఏర్పడ్డారు. రోడ్లపై ఆడుకునే చిన్నారులను ఆడవాళ్లు ఎత్తుకుపోయి నజీర్‌కు ఇచ్చేవాళ్లు. అతను ఆ పిల్లలను అమ్మేవాడు. 13 ఏప్రిల్2018న భారత్ రోడ్డుకు చెందిన గోపి కొడుకు గణేశ్(3)ను ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్‌అలీకి అమ్మేశారు. ఈ నెల 2న ముఠా సభ్యులు భారత్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండటం, గతంలో కిడ్నాప్‌కు గురైన బాలుని గురించి అడుగుతుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. టౌన్ పోలీసులు అక్కడకు వెళ్లి ముఠా సభ్యులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా కిడ్నాప్ విషయం బయటపడింది. బాలుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 2015లో కామారెడ్డి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మహిళ నుంచి ఎత్తుకుపోయిన ఓ బాలుడి ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. 2018లో హాస్పిటల్ నుంచి ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన కేసులో గతంలో వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ముఠాపై ఇంకా ఇతర జిల్లాల్లో కిడ్నాప్కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నజీర్, యాస్మిన్, షబానాను రిమాండ్‌కు తరలించారు.