జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో రాయితీ ఇవ్వాలి

జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో రాయితీ ఇవ్వాలి

బషీర్ బాగ్,- వెలుగు: ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇప్పించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే– టీడబ్ల్యూజేఎఫ్​) ప్రతినిధులు విద్యాశాఖ అధికారులను కోరారు. గురువారం నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో డీఈవో ఆర్. రోహిణిని కలిసి వినతిపత్రం అందించారు. ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు అధికంగా ఉన్నాయని, వాటిలో పిల్లలను చదివిస్తున్న పేద, మధ్యతరగతికి చెందిన జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వారి పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించాలని డీఈవోకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందుకు డీఈవో రోహిణి సానుకూలంగా స్పందించారు. డీఈవోను కలిసిన వారిలో హెచ్​యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ్​కుమార్, బి.జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, ట్రెజరర్ రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగవాణి, వైస్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు.