తల్లిదండ్రుల కోసం పోరుబాట పట్టిన చిన్నారులు

తల్లిదండ్రుల కోసం పోరుబాట పట్టిన చిన్నారులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ తమ బతుకులను ఎలా చిధ్రం చేస్తుందో చెప్పడానికి చిన్నారులు నిరాహార దీక్షకు దిగారు. పుస్తకాల బ్యాగుతో బడిబాట పట్టాల్సిన విద్యార్థులు తమ తల్లిదండ్రుల కోసం పోరుబాట పట్టారు. ప్లకార్డులతో టెంట్‌‌‌‌లో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అది కూడా చిల్ర్డన్స్‌‌‌‌ డే రోజు కావడం గమనార్హం.. జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండలంలో గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వల్ల పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో 12 గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల పంట భూములు మునిగిపోతున్నాయి. ప్రతి యేటా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. 2019 జూన్‌‌‌‌లో ఈ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభించినప్పటి నుంచి అక్కడ పంటలు పండకుండా రైతులు నష్టపోతున్నారు. 

దీంతో అక్కడి రైతులు తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా మూడేండ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారే తప్ప నష్ట పరిహారం ఇవ్వడం లేదు. గత నెలలో మహారాష్ట్ర‒తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాయింట్‌‌‌‌ సర్వే చేసి ఎకరానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. దీనికి అక్కడి రైతులు అంగీకరించలేదు. ఎకరానికి రూ.12 లక్షలకు పైగా ఇస్తేనే భూములిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 8 రోజులుగా మహారాష్ట్ర రైతులు మేడిగడ్డ బ్యారేజీకి సమీపంలో ఉన్న సిరొంచలో ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పి 144 సెక్షన్‌‌‌‌ అమలు చేస్తోంది. కేవలం నలుగురు రైతులు మాత్రమే టెంట్‌‌‌‌లో కూర్చొని నిరసన వ్యక్తం చేయడానికి పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది. దీంతో సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు తమ తల్లిదండ్రులకు మద్దతుగా నిరాహారదీక్ష చేశారు.