- జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో బాలుడు అదృశ్యం
- ట్రాక్టర్ పైనుంచి కింద పడి చనిపోగా డంప్యార్డులో పడేసిన ట్రాక్టర్ ఓనర్
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో ఆదివారం అదృశ్యమైన బందెల రాకేశ్(5) డెడ్ బాడీ మంగళవారం ఓసీ3 డంప్యార్డులో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బందెల రాజు, రజిత దంపతుల కొడుకు రాకేశ్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా, వరి కోత పనులకు వెళ్తున్న అదే గ్రామానికి చెందిన గంపల శంకర్ తన ట్రాక్టర్లో రాకేశ్‌తో పాటు మరో బాలుడిని ఎక్కించుకున్నాడు. ప్రమాదవశాత్తు రాకేశ్ ట్రాక్టర్ టైర్ల కింద పడి స్పాట్ లోనే చనిపోయాడు.
రాకేశ్ చనిపోయాడనే భయంతో శంకర్ బాలుడి డెడ్‌బాడీని గన్నీ సంచీలో చుట్టి సమీపంలోని ఓసీ3 డంపింగ్ యార్డులో పడేసి, ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు. రాకేశ్ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. శంకర్ తన ట్రాక్టర్ పై రాకేశ్‌ను ఎక్కించుకోవడం చూసిన గ్రామస్తులు అతడిని నిలదీయగా, అతను పొంతన లేని సమాధానం ఇవ్వడంతో గణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శంకర్‌ను విచారించగా విషయం బయటకు వచ్చింది. మట్టికుప్పలు వేయడంతో జేసీబీ సాయంతో మట్టిని తొలగించి డెడ్‌బాడీని బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని సీఐ సీహెచ్ కరుణాకర్‌రావు, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎస్సై అశోక్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

