
ముంబై: కుషినగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాలుడి శవం కలకలం రేపింది. ఓ బాలుడ్ని దారుణంగా హత్య చేసి ట్రైన్ టాయ్‌లెట్‌లో పడేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్లో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. లోకమాన్య తిలక్ టెర్మినల్లో ఆగిన కుషినగర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఓ కోచ్ టాయ్‌లెట్‌లో బాలుడి డెడ్ బాడీని గుర్తించినట్లు ట్రైన్ క్లీనింగ్ సిబ్బంది సమాచారం ఇచ్చారని తెలిపారు.
అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు. హత్య చేయబడిన బాలుడి వయస్సు ఆరేడు సంవత్సరాలు ఉంటుందని.. బాలుడిని చంపడానికి ముందు గుజరాత్‌లోని సూరత్ నుండి కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హంతకులు మృతదేహాన్ని కోచ్ చెత్తబుట్టలో కుక్కి నేరాన్ని దాచడానికి ప్రయత్నించారని తెలిపారు. మృతి చెందిన బాలుడు ఎవరు..? అతడి తల్లిదండ్రులు ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టామన్నారు.
మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదని.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చిన్నారిని కిరాతకంగా హత్య చేసిన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులు ఆరా తీస్తూ మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్ బృందాలు, రైల్వే భద్రతా సిబ్బంది కూడా దర్యాప్తులో పాల్గొంటున్నారని పోలీసులు వెల్లడించారు. ట్రైన్ కోచ్ బాత్ రూంలో బాలుడి శవం కలకలం రేపడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.