అరుణాచల్ ప్రదేశ్ మాదే..చైనా మళ్లీ మొండి వాదన

అరుణాచల్ ప్రదేశ్ మాదే..చైనా మళ్లీ మొండి వాదన

బీజింగ్ :  అరుణాచల్ ప్రదేశ్ పై తన మొండి వాదనను చైనా కొనసాగిస్తూనే ఉంది. వాటిని అసంబద్ధం, హాస్యాస్పదమని భారత్ కొట్టి పారేసినప్పటికీ డ్రాగన్ మాత్రం నోరు మూయడం లేదు. ఇటీవలి సింగపూర్ పర్యటనలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ దీటుగా సమాధానమిచ్చినప్పటికీ చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని డ్రాగన్ వాదించింది. ‘‘భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడు షరిష్కారం కాలేదు. అది ఎప్పుడు చైనాలో భాగమే. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. 1987లో భారత్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్ రూపొందించుకుంది.

ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నాం. దీనిపై చైనా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు”అని చైనా విదేశాంగ శాఖ మంత్రి లిన్ జియాన్ తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈ పర్యటనతో ఉలిక్కిపడిన చైనా అది తమ భూభాగమేనని వాదించింది. దీనిపై భారత్ దౌత్యపరంగా నిరసన తెలియజేసింది. అయినప్పటికీ చైనా ఈ విధంగానే వాదిస్తుంది. డ్రాగన్ ఈ విధంగా వాదించడం గత నెల రోజుల్లో ఇది నాలుగోసారి. చైనా వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిస్తూనే ఉంది. “ఇది కొత్త విషయం కాదు. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా వాటిని మరింత పెంచింది. అవి మొదటి నుంచి హాస్యస్పదంగానే ఉన్నాయి. ప్రస్తుతం కూడా అంతే”అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు చైనా మరోసారి ఇలా స్పందించింది.