బీజింగ్, వెల్లింగ్టన్: చైనాకు జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు జిన్‌పింగ్ లైన్ క్లియర్ చేసుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో తన పవర్‌ను సుస్థిరం చేసుకున్నారు. ఈమేరకు పార్టీ సమావేశాల్లో కీలక తీర్మానాన్ని ఆమోదింపచేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)లో వందేండ్ల తర్వాత మార్పులు చేసి, వచ్చే ఏడాది పదవిలోకి రావడానికి అడ్డంకులను తొలగించుకున్నారు. పార్టీ నియమావళిని మూడోసారి మార్చి, కీలక తీర్మానాన్ని సెంట్రల్ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. తన హయాంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ జిన్‌పింగ్ గురువారం కీలక ఉపన్యాసం చేశారు. సీపీసీ జనరల్ సెక్రెటరీ, సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్, ప్రెసిడెంట్‌గా ఉన్న జిన్‌పింగ్ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఎవరైనా సరే రెండు సార్లు మాత్రమే ప్రెసిడెంట్ అవ్వాలనే రూల్‌ను, 68 ఏళ్ల తర్వాత రిటైర్ అవ్వాలనే రూల్‌ను గతంలోనే సవరించారు. వచ్చే ఏడాది మాత్రమే కాదు.. 2027లో నాలుగో సారి కూడా జిన్‌పింగ్ అధ్యక్షుడవుతారని చైనా నేతలు అంటున్నారు.
కోల్డ్ వార్ పరిస్థితులు వద్దు
ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ‘కోల్డ్ వార్’ కాలం నాటి పరిస్థితులను తీసుకురావద్దని చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ హెచ్చరించారు. అప్పటి ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించవద్దన్నారు. ఇటీవల కొత్త భద్రతా కూటమిని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఏపీఈసీ) ఫోరమ్ యాన్యువల్ సమ్మిట్‌లో జిన్‌పింగ్ వర్చువల్‌గా మాట్లాడారు. సైద్ధాంతిక లేదా భౌగోళిక రాజకీయ మార్గాల ద్వారా ఈ ప్రాంతంలో సరిహద్దులను గీయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయని స్పష్టం చేశారు. ఆసియా–పసిఫిక్ రిజయన్‌లో సప్లయ్ లైన్స్ పని చేసేలా చూసుకోవాలని, వ్యాపారం, పెట్టుబడులను లిబరలైజ్ చేయడం కొనసాగించాలని అన్నారు. ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో చైనా బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు, వీలైనంత త్వరగా దాని నీడ నుండి బయటపడేందుకు అన్ని విధాలుగా కృషి చేయడమే.. ఈ రీజియన్‌లో అత్యంత ముఖ్యమైన పని అని జిన్‌పింగ్ అన్నారు.
