ఢాకా: ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించడంపై చైనా స్పందించింది. అది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. ఈ అంశంపై తాము ఇంతకంటే ఎక్కువ మాట్లాడమని స్పష్టం చేసింది. మంగళవారం (నవంబర్ 18) బీజింగ్‌లో జరిగిన ఓ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ షేక్ హసీనా మరణ శిక్షపై రియాక్ట్ అయ్యారు. అది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌తో స్నేహపూర్వక విధానానికి చైనా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బంగ్లా స్థిరత్వం, అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నామని మావో నింగ్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
2024 జూలై, ఆగస్ట్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేసింది. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ప్రాణ భయంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయింది.
►ALSO READ | మెక్సికో దాడులపై ట్రంప్ హాట్ కామెంట్స్.. మదురోతో చర్చలకు గ్రీన్ సిగ్నల్..!
షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. 2024 జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అప్పటి ప్రధాని షేక్ హసీనా క్రూరంగా అణిచివేశారని ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి.
ఈ క్రమంలోనే ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ విచారణ జరిపి ఈ కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఐసీటీ తీర్పు అనంతరం ఇండియాలో తలదాచుకుంటున్న హసీనాను అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ కోరింది.
