భారత్కు విమానాలు నడిపేందుకు మేం రెడీ: చైనా

భారత్కు విమానాలు నడిపేందుకు మేం రెడీ: చైనా

రెండు దేశాల మధ్య ఐదేళ్ల విరామం తర్వాత డైరెక్ట్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు భారత్, చైనాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం(ఆగస్టు14) వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి భారత్, చైనాల మధ్య డైరెక్ట్ విమానాలు నిలిచిపోయాయి. 

అయితే తాజాగా ఇరు దేశాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాయి. దీనిపై రెండు దేశాల ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ..విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రయాణికుల అవసరాలు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచేందుకు వీలైనంత త్వరగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నామని  అన్నారు. 

ప్రస్తుతం భారత్, చైనాల మధ్య డైరెక్ట్ విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు థాయ్‌లాండ్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం, ఖర్చు రెండూ పెరిగాయి. డైరెక్ట్ విమానాలు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. 

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రెండు దేశాల విమానయాన సంస్థలు విమానాలను పునరుద్దరించేందుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మావోనింగ్ అన్నారు.