చైనాలో మళ్లీ కరోనా కలకలం.. ఓ నగరం మూసివేత

చైనాలో మళ్లీ కరోనా కలకలం.. ఓ నగరం మూసివేత
  • ఝాంగ్జియాజీ నగర  ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ఆదేశం
  • పర్యాటకులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలంటూ ఆదేశాలు

బీజింగ్: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కనిపించిన చైనాలో మళ్లీ మహమ్మారి కోరలు చాచింది. ఎంతగా అంటే సరిగ్గా ఏడాదిన్నర క్రితం తొలిసారి కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి పరిస్థితిని గుర్తు చేస్తూ.. డెల్టా వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో చైనా చిగురుటాకులా వణికిపోతోంది. ఒక్కసారిగా కేసులు అనూహ్యంగా పెరిగడంతో ఝాంగ్జియాజీ నగరం మొత్తం కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించారు.
సుమారు 1.5 మిలియన్ల జనాభా ఉన్న ఝాంగ్జియాజీ నగర ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు తాము ఉన్నచోటనే ఆగిపోవాలంటూ హుకుం జారీ చేసింది. కరోనా వ్యాప్తికి స్థానిక అధికారులు, నేతలు బాధ్యులుగా చేస్తూ.. చర్యలకు ఉపక్రమించింది. నగరమంతటా శానిటేషన్ చేయిస్తూ.. వైరస్ ను నిర్మూలించేందుకు తంటాలు పడుతోంది.
తూర్పు నగరం నాన్జింగ్‌లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టుతో సంబంధాలున్న మొత్తం 17 ప్రావిన్సులను డెల్టా వేరియంట్ విస్తరించినట్లు గుర్తించింది.  జియాంగ్సు ప్రావిన్సులో బయటపడిన కరోనా వేరియంట్ గతంలో అంటే 2019 చివరలో మొట్ట మొదటి కేసులు బయటపడిన వుహాన్‌  వైరస్ ను పోలి ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి వచ్చిందని భావించిన కోవిడ్ 19కు ఇప్పుడు ఝాంగ్జియాజీ నగరం  హాట్ స్పాట్ లా మారినట్లు గుర్తించారు.