చైనా రక్షణ బడ్జెట్​.. మనకన్నా మూడింతలు

చైనా రక్షణ బడ్జెట్​.. మనకన్నా మూడింతలు
  • 6.8% పెంపుతో రూ.15.27 లక్షల కోట్లు ప్రతిపాదన
  • చైనా పార్లమెంట్​లో బడ్జెట్​ను ప్రకటించిన ప్రధాని లీ
  • నిరుడు సైన్యం గొప్ప విజయం సాధించిందని కామెంట్​

బీజింగ్​: వరుసగా ఆరో ఏడాదీ చైనా రక్షణ బడ్జెట్​ను పెంచింది. 2021కిగానూ 20,900 కోట్ల డాలర్ల (సుమారు రూ.15 లక్షల 27 వేల 103 కోట్లు) బడ్జెట్​ను ప్రతిపాదించింది. గత ఏడాది కన్నా 6.8% ఎక్కువ నిధులను కేటాయించింది. మన రక్షణ బడ్జెట్​తో పోలిస్తే చైనా బడ్జెట్​ మూడింతలు ఎక్కువ కాగా.. అదే అమెరికా బడ్జెట్​లో కేవలం పావు వంతే. శుక్రవారం చైనా పార్లమెంట్ నేషనల్​ పీపుల్స్​ కాంగ్రెస్(ఎన్పీసీ)లో ప్రధాని లీ కెఖియాంగ్​ రక్షణ బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.

సక్సెస్​ అయినం

కిందటేడాది తూర్పు లడఖ్​లోని లైన్​ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్​ వద్ద చైనా దూకుడుగా వ్యవహరించింది. హద్దులను దాటి ముందుకు వచ్చింది. మన సైన్యమూ చైనా సైన్యానికి దీటుగా జవాబిచ్చింది. దాదాపు 8 నెలల పాటు సాగిన టెన్షన్లలో గల్వాన్​ ఘటన జరిగింది. కర్నల్​ సంతోష్​ బాబు సహా మన 20 మంది సైనికులు అమరులయ్యారు. అయితే, ఈ టెన్షన్లను నేరుగా ప్రస్తావించకుండా.. నిరుడు మన సైన్యం గొప్ప విజయాన్ని నమోదు చేసిందంటూ చైనా ప్రధాని లీ కెఖియాంగ్​ కామెంట్​ చేశారు. తమ సైనికులు ఎదుటి వారికి గట్టి పోటీనిచ్చారని, దేశ రక్షణ, దేశ భూభాగాన్ని కాపాడడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. సెంట్రల్​ మిలటరీ కమిషన్​ (సీఎంసీ)కి అధిపతిగా, దేశాధ్యక్షుడిగా షి జిన్​పింగ్​ ఆర్మీ కోసం ఎంతో చేశారని అన్నారు.

సైన్యం ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలె

జిన్​పింగ్​ ఆలోచనలకు తగ్గట్టు ఆర్మీని మరింత బలంగా తయారు చేస్తామని లీ చెప్పారు.  రాజకీయ నిర్ణయాలు, ప్రభుత్వానికి సైన్యం ఎప్పుడూ విధేయంగా ఉండాలని, అందు కోసం  మరిన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. సైన్స్​ అండ్​ టెక్నాలజీ వాడకాన్ని పెంచుతామని, సైన్యాన్ని సమర్థంగా తీర్చిదిద్దేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని లీ వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సైన్యాన్ని సన్నద్ధం చేస్తామన్నారు.

నిరుడు బడ్జెట్​ 14.35 లక్షల కోట్లు

చైనా నిరుడు పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీకి కేటాయించిన బడ్జెట్ 19,644 కోట్ల డాలర్లు (రూ.14,35, 791 కోట్లు). ఇప్పుడు దానికి అదనంగా 6.8% పెంచింది. అయితే, అమెరికా రక్షణ బడ్జెట్​ 74,050 కోట్ల డాలర్లతో (రూ.54,09,837 కోట్లు) పోలిస్తే చైనా కేటాయింపులు పావు వంతే. అదే సమయంలో మన దేశం కేటాయించిన 6,570 కోట్ల డాలర్లతో (రూ.4.8 లక్షల కోట్లు) పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. రక్షణ బడ్జెట్​లో భాగంగా తలసరి ఖర్చును 154 డాలర్లుగా చైనా ప్రకటించింది.

అమెరికాకు దీటుగా సైన్యాన్ని మోడర్నైజ్​ చేయడానికే..

ఈబడ్జెట్​లో యుద్ధ విమానాలు, సైన్యానికి అవసరమైన హార్డ్​వేర్​కే ఎక్కువ నిధులు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. యుద్ధ విమానాలను తీసుకెళ్లే యుద్ధ నౌకలనూ కొత్తగా నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రెండింటిని నిర్మిస్తున్న చైనా.. వాటికి అదనంగా మరిన్ని యుద్ధ నౌకలను తయారు చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ విషయంపై అమెరికా, చైనా మధ్య టెన్షన్లు నెలకొన్న క్రమంలో వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 2027 నాటికి అమెరికాకు దీటుగా సైన్యాన్ని మోడర్నైజ్​ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. యువకులను సైన్యం దిశగా ఆకర్షించేందుకు జీతాలను ఈ ఏడాది 40% వరకు పెంచింది ప్రభుత్వం.