ప్రపంచానికి క్లియర్ మెసేజ్.. పుతిన్ భారత్ పర్యటనపై చైనా మీడియా ప్రశంసలు

ప్రపంచానికి క్లియర్ మెసేజ్.. పుతిన్ భారత్ పర్యటనపై చైనా మీడియా ప్రశంసలు
  • ఆంక్షలు ఫలించవు.. ప్రపంచంలో ఏ దేశం ఒంటరి కాదని విశ్లేషణలు

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా పర్యటన చైనా మీడియాలో ప్రశంసలు కురిపించింది. పుతిన్–మోదీ భేటీ భారత్–రష్యా బంధాలను మరింత బలపరిచిందని పేర్కొంది. అమెరికా, పశ్చిమ దేశాల ఒత్తిళ్ల మధ్య జరిగిన ఈ పర్యటన ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని తెలిపాయి. ఏ దేశమూ ఒంటరిగా లేదని, రెండు దేశాలు పరస్పర మద్దతును అందించుకుంటున్నాని వివరించాయి. పుతిన్ పర్యటనపై చైనా ఫారిన్ అఫైర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ స్పందనను గ్లోబల్ టైమ్స్ పత్రిక రిపోర్టు చేసింది. భారత్–రష్యా బంధం అత్యంత వ్యూహాత్మకమని, ఒత్తిళ్లను బలంగా తట్టుకుంటుందని ఆయన తెలిపారు. 

‘‘పుతిన్ పర్యటన ద్వారా రెండు దేశాలు ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చాయి. ఎవరూ ఒంటరి కాదు’’ అని లీ అన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర మద్దతు, పూర్తి సహకారం ఉందని చెప్పారు. అమెరికా, పశ్చిమ దేశాల సంక్షణలు, ఒత్తిడి విఫలమవుతాయని విశ్లేషించారు. రెండు దేశాలు తమ స్వతంత్ర సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనను చైనా మీడియా ప్రపంచంలోని బలమైన 
ద్వైపాక్షిక బంధాల నిదర్శనంగా చూస్తున్నది.

భారత్​కు అవకాశాలు, సవాళ్లు

పుతిన్ పర్యటన భారత్‌‌‌‌కు అవకాశాలు, సవాళ్లు రెండింటిని తీసుకువస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. రష్యాతో వాణిజ్యం తగ్గించమని అమెరికా భారత్​పై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి క్రూడాయిల్ ​కొనుగోళ్లకు జరుపుతున్నందుకు భారత్​పై 25% అదనపు సుంకాలు విధించింది. అంక్షలున్నప్పటికీ పుతిన్ భారత్​లో పర్యటించడంతో.. రెండు దేశాల బంధం మరింత బలపడింది. 

ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, యురోపియన్​యూనియన్​తో వాణిజ్యం ప్రభావితమవుతాయని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో అమెరికా తన నేషనల్ సెక్యూరిటీ రిపోర్ట్‌‌‌‌లో భారత్‌‌‌‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, క్వాడ్‌‌‌‌(అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కూటమి)​తో కలిసి చైనాను నిలువరించాలని పేర్కొన్నది. అలాగే ట్రంప్ బృందం త్వరలో భారత్ వచ్చి వాణిజ్య చర్చలు జరపనుంది.