పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌లో చైనా ఆర్మీ సర్వే

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌లో చైనా ఆర్మీ సర్వే
  • బార్డర్ పోస్టులు, గ్రామాల పరిశీలన 

న్యూఢిల్లీ:  పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌‌ (పీవోకే)లో చైనీస్ ఆర్మీ కదలికలు పెరిగాయి. ఇటీవల పీవోకేలోని కీలకమైన గ్రామాలు, బార్డర్ పోస్టుల వద్ద చైనీస్ ఆర్మీకి చెందిన అధికారులు సీక్రెట్ గా సర్వే చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు గుర్తించాయి. పీవోకేలోని కేల్, జురా, లీపా ఏరియాకు వచ్చిన చైనా సోల్జర్లు ఐదారుగురు ఒక్కో టీంగా ఏర్పడి గ్రామాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సర్వే సందర్భంగా చైనా సోల్జర్ల వెంట పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. పీవోకేలో ప్రస్తుత పరిస్థితిని రక్షణ శాఖ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.  అటు ప్రజలకు, ఇటు మిలిటరీ అవసరాలకు ఉపయోగపడేలా పీవోకేలోని గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంపై చైనా ఫోకస్ పెట్టినట్లుగా ఈ సర్వేను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే పీవోకే గుండా విస్తరించి ఉన్న చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్ కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. సైనికపరంగా కూడా పూర్తిగా సహకరించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటు అరుణాచల్ బార్డర్ లో సివిల్, మిలిటరీ ఉపయోగాల కోసం గ్రామాలను నిర్మిస్తున్నట్లే.. అటు పీవోకేలోనూ టూ ఇన్ వన్ పర్పస్ గ్రామాలను సిద్ధం చేసేందుకు డ్రాగన్ కసరత్తు చేస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.