చైనాలోని మనుషులను చంపేస్తున్న కరోనా వైరస్ ఓ యువతి జీవితాన్ని నిలబెట్టిందని డెయిల్ మెయిల్ వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
రెండురోజుల క్రితం వుహాన్ నగరం జింగ్షాన్ లో షియావో అనే యువతి (25) ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అప్పుడే షియోవోకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా దగ్గడం మొదలు పెట్టింది. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏమైంది..? ఎందుకు దగ్గుతున్నావ్..? అని ప్రశ్నించాడు. బుదులుగా నాకు కరోనా సోకింది. అందుకే మా అమ్మా, నాన్న నన్ను విడిచి దూరంగా వెళ్లిపోయారు. ఇంట్లోనేను ఒంటరిగా ఉంటున్నానని చెప్పడంతో కంగుతిన్న నిందితుడు వెళ్తూ వెళ్తూ ఆమె దగ్గరనున్న 338యువాన్లను తస్కరించాడు.
సంఘటన అనంతరం షియావో పోలీసులను ఆశ్రయించింది. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ప్రాణాలు కాపాడుకునేందుకు కరోనా సోకిందని అబద్ధం చెప్పినట్లు డెయిల్ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. యువతి చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
