అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. కుటుంబాలకు రూ.15 లక్షల చెక్కుల పంపిణీ

అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. కుటుంబాలకు రూ.15 లక్షల చెక్కుల పంపిణీ

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నివసిస్తున్న గిరిజన కుటుంబాల అభివృద్ధి, అటవీ, వన్యప్రాణి సంరక్షణను సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన గ్రామాలకు చెందిన కుటుంబాలకు పునరావాసం కల్పించడంలో కీలక ముందడుగు పడింది. మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన మొత్తం 417 కుటుంబాలకు పునరావాసం కల్పించనున్నారు. అందులో భాగంగా 2026 మార్చి 25న చెక్కుల పంపిణీ చేశారు.  

అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో 14 మంది గిరిజన కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. అమ్రాబాద్ అడవుల్లో శతాబ్దాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో అటవీ, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇది సాధారణ పరిపాలనా నిర్ణయం కాదఉ.. చారిత్రాత్మక సామాజిక–పర్యావరణ సంస్కరణ అని  పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా గిరిజనుల అభీష్టం మేరకే జరుగుతోందని చెప్పారు.

బచారం దగ్గర పునరావాసం:

గిరిజన కుటుంబాలకు నాగర్ జిల్లా బచారం వద్ద పునరావాసం కల్పించనున్నారు. దీని కోసం మొత్తం  ₹62.55 కోట్లు కేటాయించినట్లు భట్టీ తెలిపారు. ఇందులో ₹24 కోట్లు నగదు పరిహారం కోసం, ₹38.55 కోట్లు గృహ వసతి కోసం వినియోగిస్తున్నామన్నారు. సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాలపెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందిన కుటుంబాల అభివృద్ధికి మొత్తం బచారం వద్ద ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. పునరావాసం తర్వాత గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా కల్పించనున్నట్లు తెలిపారు.

  • రెండు విధాలుగా సహాయం:

    •    160 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹15 లక్షల నగదు పరిహారం
    •    257 కుటుంబాలకు నాగర్‌కర్నూల్ జిల్లా బచారం వద్ద ఆధునిక గృహ వసతితో పాటుగా 5 ఎకరాల వ్యవసాయ భూమి

పాఠశాలలు, అంగన్‌వాడీలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు:

గిరిజన పిల్లలకు ఆధునిక పాఠశాలలు, అంగన్‌వాడీలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా వారి ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేస్తామని తెలిపారు. నగదు పరిహారం కింద ఇచ్చే ₹15 లక్షలు దేశంలోనే అత్యధిక పరిహారాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు.

►ALSO READ | రేవంత్.. సిద్దిపేటకు రా.. ఎవరో ఎందుకు నువ్వే నాపై పోటీ చెయ్యి: హరీశ్ రావు సవాల్

ఈ నిర్ణయం ద్వారా సుమారు 1501 హెక్టార్ల అటవీ భూమి పునరుద్ధరించబడుతుందని, పులులు సహా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. పులుల సంఖ్య పెంపుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. బచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని అన్ని మౌలిక వసతులతో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్లు, రైతు వేదికలు వంటి అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీ కృష్ణా, రాజేష్ రెడ్డి, పీసీసీఎఫ్( వైల్డ్ లైఫ్) వినయ్ కుమార్, సీసీఎఫ్(campa) క్షితిజ, సీఎఫ్ సునీల్ హిరామత్, నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, డీఎఫ్ఓ రేవంత్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు..