మహబూబ్‌నగర్, వెలుగు: ముందస్తు ప్రణాళికతో పనిచేస్తేనే ఎల్‌నినో ఎఫెక్ట్‌ను ఎదుర్కోవచ్చని ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో సోమవారం ఎల్‌నిన్ ఎఫెక్ట్.. ప్రత్యామ్నాయ కార్యాచరణపై ఉమ్మడి జిల్లా స్థాయి రివ్యూ చేశారు. ఈ రివ్యూకు దామోదర చీఫ్ గెస్ట్‌గా హాజరు కాగా, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. తొలుత ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, ఆల్మట్టి నిండిన తర్వాతే దిగువ ప్రాంతాలకు నీరు వచ్చే పరిస్థితి ఉంటుందని వివరించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఆయా రిజర్వాయర్లలో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
హ్యాండ్ పంపులు, బోర్లను రిపేర్లు చేయడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టే కార్యక్రమాలను స్పీడప్ చేసి, బోర్ వెల్ రీచార్జ్, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులు, ఇతర నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రైతులు ఆరు తడి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, తుడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, విజేయుడు, కలెక్టర్లు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివ సేనా రెడ్డి, నగర మేయర్ జి.మమత, తదితరులు పాల్గొన్నారు.
