హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్పై కలెక్టర్ హరిచందన కీలక ప్రకటన

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్పై కలెక్టర్ హరిచందన కీలక ప్రకటన

హైదరాబాద్: హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ లభ్యతపై కలెక్టర్ హరిచందన కీలక ప్రకటన చేశారు. 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉందని.. హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో అధికారులతో రివ్యూ చేశామని ఆమె స్పష్టం చేశారు. ఎవరూ కూడా పుకార్లు నమ్మొద్దని.. సరిపడ పెట్రోల్ ఉందని ఆమె చెప్పారు.

పరిస్థితులను అర్థం చేసుకుని పెట్రోల్, డీజీల్ను స్టోర్ చేసుకోవద్దని వాహనదారులను ఆమె కోరారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న 186 పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితిని సమీక్షించామని, పెట్రోల్ బంకుల్లో కావాల్సినంత  సప్లై జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలతో చాలా మంది భయాందోళనలకు లోనయ్యారని.. పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాదులో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మవద్దని ఆయన సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ దొరకడం లేదంటూ వార్తలు వచ్చాయని, హైదరాబాద్ సిటీలో కూడా పరిస్థితి అదే విధంగా ఉందని నమ్మి చాలామంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లో ఉంటున్నారని సీపీ చెప్పారు.

60 రోజులకు సరిపడా పెట్రోలు తెలంగాణ రాష్ట్రంలో ఉందని, ఎవరూ కూడా అపోహలు నమ్మవద్దని ఆయన సూచించారు. సోషల్ మీడియా వార్తలపై నిఘా పెట్టామని, తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.