Jasprit Bumrah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఆరంభానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లీగ్ కి ముందు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం బారిన పడ్డాడంటూ సోషల్ మీడియాలో జరిగిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు బుమ్రా వెళ్లడంతోనే ఈ ప్రచారం జరిగిందన్నారు. అతడు కేవలం సాధారణ ఫిట్‌నెస్ చెకప్ కోసమే వెళ్లినట్లు తేలింది.
బుమ్రా సిద్ధం:
గత సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో లేకపోవడం ముంబై జట్టును తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. అనంతరం అతను జట్టులోకి వచ్చి 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి జట్టును క్వాలిఫయర్-–2కి చేర్చాడు. కానీ ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా, మార్చి 29వ తేదీన వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరగనున్న తొలి మ్యాచ్ నుంచే అతడు బరిలోకి దిగనున్నాడు.
►ALSO READ | Jasprit Bumrah: నీకు ఇల్లు గుర్తుకు రావడం లేదా.. ధురంధర్ డైలాగ్తో బుమ్రాకి వైఫ్ వార్నింగ్
ఆరో టైటిల్ వేట:
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో బుమ్రా కీ రోల్ పోషించాడు. అదే భీకర ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించి, ముంబై ఇండియన్స్‌కు ఆరో ట్రోఫీని అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు ఈసారి అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
జట్టు బలాలు:
టీ20 ప్రపంచకప్ 2026 అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, తిలక్ వర్మలు ముంబై ఇండియన్స్ జట్టులో ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ కాగా, వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ అనుభవం జట్టుకు కొండంత అండగా నిలవనుంది. అలాగే ఈ సీజన్‌లో జట్టులోకి షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర బ్యాటర్లు మిడిల్ ఆర్డర్‌లో భారీ హిట్టింగ్‌కు సిద్ధంగా ఉన్నారు. గతేడాది పంజాబ్ కింగ్స్ చేతిలో క్వాలిఫయర్-2లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి, ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా ముంబై జట్టు బరిలోకి దిగుతుంది.
