- కేంద్ర జలశక్తి శాఖ, ఎన్‌డీఎస్‌ఏ నుంచి మరోసారి క్లారిటీ తీసుకోండి
- ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక ప్రకారమే గేట్లు ఖుల్లా పెట్టామన్న మంత్రి
- అన్నారం బ్యారేజీ కింద కూడా గోతులున్నాయన్న అధికారులు
- బ్యారేజీల నుంచి వరద నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదని వివరణ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేసి, ఎత్తిపోయొచ్చా? లేదా? అనే విషయంలో మరోసారి కేంద్ర జలశక్తి శాఖ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి టెక్నికల్గైడెన్స్ తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. గతంలో ఎన్‌డీఎస్‌ఏ సలహా మేరకే బ్యారేజీల భద్రత దృష్ట్యా గేట్లు ఓపెన్ చేసి పెట్టామని స్పష్టం చేశారు.
కేంద్ర సంస్థల నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు వచ్చినప్పుడే కాళేశ్వరం లిఫ్టులను నడిపిస్తామని తేల్చి చెప్పారు. బ్యారేజీల పరిస్థితి బాగాలేనందున వాటికి రిపేర్లు చేసేదాకా గేట్లు ఖుల్లా పెట్టాలంటూ గతంలో ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన రిపోర్ట్, ఇతరత్రా టెక్నికల్ అంశాలను బయటకు తీసి, ఆ కాపీని కేంద్రజలశక్తి శాఖ, ఎన్‌డీఎస్‌ఏ అధికారులకు పంపించి.. వివరణ కోరాలన్నారు. వెంటనే ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌కు సంబంధిత పత్రాలను అందించి.. జలశక్తి శాఖకు పంపించేలా చూడాలని ఆదేశించారు.
శుక్రవారం కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. బ్యారేజీల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) గుర్తించిన లోపాలు, గ్రౌండ్పెనట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెస్టులు, రాఫ్ట్‌ల కింద ఉన్న భారీ గోతులపై ఆధారాలతో ఎన్‌డీఎస్‌ఏకి వివరించాలని స్పష్టంచేశారు.
అన్నారం బ్యారేజీల్లోనూ లోపాలు
మూడు బ్యారేజీల్లో సెంట్రల్వాటర్ అండ్ పవర్ రీసెర్చ్‌స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) స్టడీస్ పూర్తి కావొచ్చాయని మంత్రి ఉత్తమ్‌కు అధికారులు వివరించారు. అన్నారం బ్యారేజీలోనూ లోపాలున్నట్టు గుర్తించామన్నారు. బ్యారేజీ రాఫ్ట్ కింద గోతులున్నాయని తేలిందని వివరించారు. మేడిగడ్డ డిజైన్లు ఆగస్టు చివరి వరకు పూర్తవుతాయని తెలిపారు. సెప్టెంబర్ రెండో వారం నాటికి రిపేర్ల ఖర్చులపై ప్రాథమిక అంచనా వస్తుందని చెప్పారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఇన్వెస్టిగేషన్స్డేటా 2 వారాల్లో వస్తుందని వివరించారు. బ్యారేజీలకు వరద వస్తున్నంత మాత్రాన నీటిని ఎత్తిపోయడానికి వీలుకాదని తేల్చి చెప్పారు. ఎగువన ప్రస్తుతం నీటి స్థాయిలను మెయింటెయిన్ చేసే పరిస్థితి లేదన్నారు. బ్యారేజీల హైడ్రాలిక్ పరిస్థితులను తేల్చకుండా తాత్కాలికంగా కూడా పంపింగ్చేసేందుకు ఆస్కారమే లేదని చెప్పారు. లిఫ్టింగ్ చేస్తే అనవసరమైన ముప్పు తలెత్తి.. బ్యారేజీలకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.
కాగా, తదుపరి మీటింగ్‌లో టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ ముందు బ్యారేజీల పునరుద్ధరణ ఖర్చు ప్రతిపాదనలు పెట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని లిఫ్టింగ్‌పై ఎలాంటి అనవసర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కాగా, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలపైనా మంత్రి రివ్యూ చేశారు. నీటి కేటాయింపుల సమస్యలు, ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్న తరుణంలో ప్రాజెక్ట్ డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రాసెస్ కావట్లేదని మంత్రి ఉత్తమ్‌కు అధికారులు తెలిపారు.
