హైదరాబాద్: కాటేదాన్లో మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీపై మైలార్ దేవ్ పల్లి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన కోడి గుడ్లు, కెమికల్స్ వాడి అపరిశుభ్ర వాతావరణంలో బన్స్, కేకులు తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ బేకరీ యూనిట్ నిర్వహిస్తున్న అఫ్రీదీ అన్సారీ, యాసిన్.. మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సిటీలోని అత్తాపూర్‌లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఐస్ క్రీమ్ తయారీ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు.. నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎం.ఎం. పహాడీలో ఉన్న గోడౌన్లపై ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు సోదరులను అరెస్ట్ చేశారు.
నిందితులు అపరిశుభ్ర వాతావరణంలో శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్ వంటి ప్రమాదకర రసాయనాలు కలిపి నకిలీ పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి నగరంలోని కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దాడుల్లో సుమారు రూ.3.5 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నకిలీ పేస్ట్‌తో పాటు రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను అత్తాపూర్ పోలీసులకు అప్పగించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
