న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీల వ మనదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయనే విమర్శలు నిజం కాదని తేలింది. ఏఐ సంబంధిత నియామకాలు భారీగా పెరుగుతున్నాయని నోమురా హోల్డింగ్స్ సంస్థ వెల్లడించింది. భారతదేశం చాలా పెద్ద దేశం కావడంతో పాటు ఇక్కడ ఉద్యోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువ.
అందుకే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం, కొత్త నియామకాలు ఆగిపోవడం వంటి ఏ మార్పు జరిగినా, ఆ ప్రభావం మిగిలిన దేశాల కంటే సంఖ్యాపరంగా భారత్‌లోనే అత్యధికంగా కనిపిస్తోంది. సోనాల్ వర్మ, సీ యింగ్ టో అనే ఆర్థికవేత్తలు 2022 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఆసియా వ్యాప్తంగా సేకరించిన అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం.. భారత్‌లో ఈ కాలంలో 83,100 ఏఐ సంబంధిత నియామకాలు జరిగాయి.
కేవలం 31,921 మంది మాత్రమే తొలగింపులు, ఇతర కారణాల వల్ల ఉపాధి కోల్పోయారు. చాట్‌బాట్‌ల ద్వారా సపోర్ట్ టీమ్‌లను భర్తీ చేయడం వల్ల ఎక్కువ తొలగింపులు జరిగాయి. ఏఐ డిమాండ్ కారణంగా ఐటీ సర్వీసెస్ గ్రాడ్యుయేట్లకు సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లు దొరుకుతున్నాయి. ఆసియాదేశాల్లో మొత్తం 1,30,758 ఏఐ సంబంధిత ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో 90 శాతానికి పైగా టెక్నాలజీ రంగంలోనే ఉన్నాయి. మొత్తం 60,654 మంది ఉద్యోగాలు పోగా, వీటిలో 60 శాతం ఆర్థిక సేవల రంగంలోనే ఉన్నాయి.
ఏఐతో మేలే ఎక్కువ
ఏఐ టెక్నాలజీల వాడకం పెరుగుతున్న కారణంగా భారీగా ఉద్యోగాలు కోల్పోతున్నారనే కథనాలు తప్పని ఈ ఫలితాలు నిరూపించాయి. ఏఐ విప్లవం ప్రారంభ దశలో ఉద్యోగ కల్పన, నష్టాల కంటే ఎక్కువే ఉంది. ఫిలిప్పీన్స్, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో కూడా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నందున, ఇదే ధోరణి కనిపిస్తోంది. ఈ టెక్నాలజీతో కొత్త ఉద్యోగాలు వస్తున్నప్పటికీ, పాత ఉద్యోగాలూ పోతున్నాయి.
ఈ మార్పు అందరికీ ఒకేలా ఉపయోగపడటం లేదు. కస్టమర్ కేర్ లేదా డేటా ఎంట్రీ వంటి సాధారణ పనులు చేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారు, వెంటనే "ఏఐ ఇంజనీర్లు"గా మారి కొత్త ఉద్యోగాలు సాధించడం సాధ్యం కాదు. వారికీ, ఆ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని నోమురా హోల్డింగ్స్ తెలిపింది. ఆసియాలోని వివిధ దేశాలలో ఉద్యోగ రంగాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఈ లెక్కలను కచ్చితమైన వి అని భావించకుండా, మార్కెట్ ట్రెండ్‌గా మాత్రమే చూడాలని నిపుణులు చెబుతున్నారు.
