- అభివృద్ధి పనులకు డబ్బులు లేవని..
- చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని రిజైన్
జగిత్యాల టౌన్, వెలుగు: ఏడాదిగా గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గమైన ధర్మపురిలోని బుగ్గారం మండలం చిన్నాపూర్ సర్పంచ్ లతాశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్అయిన ఆమె సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ కు తన రాజీనామా లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లతా శ్రీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సంబంధించి బల్బుల ఫిట్టింగ్, డ్రైనేజీలు క్లీన్ చేయడానికి, బ్లీచింగ్ పౌడర్‌కు కూడా డబ్బులు లేవని, అయినా పనులు చేయాలని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని అవేదన చెందారు. ఇప్పటికే అప్పులు తెచ్చి పనులు చేశామని, చేసిన పనులకు రూ . 7 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీకి కాదన్నారు.
