మెగాస్టార్ చిరంజీవితో (సోమవారం మే25, 2026న) జరిగిన నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, నిర్మాతలు కె.ఎల్. నారాయణ, దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్ శ్రీధర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జువ్వాడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో.. పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై వారు చిరంజీవితో వివరంగా చర్చించారు. అలాగే, ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశంలో వివరించారు. ఇక రెండు రోజుల్లో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమైంది. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది.
సమావేశం అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “చిరంజీవి గారికి సమస్యలను పూర్తిగా వివరించాము. ఇప్పటికే ఏర్పాటైన కమిటీ నుండి అన్ని వివరాలు తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. అయితే, ఇది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య. అంతేగానీ పెద్ది సినిమాకు సంబంధించింది కాదు,” అని ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు అన్నారు.
ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ, చిరంజీవి స్పందన సానుకూలంగా ఉందని తెలిపారు. “సమస్యలన్నింటినీ ఆయన శ్రద్ధగా విన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు,” అని ఆయన తెలిపారు. మొత్తానికి ఈ సమావేశం ఇండస్ట్రీ సమస్యల పరిష్కార దిశగా కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.
Exhibitors with @KChiruTweets #Exhibitors #MegastarChiranjeevi #Chiranjeevi #Peddi pic.twitter.com/mhNlqkvxyr
— Telugu Film Producers Council (@tfpcin) May 25, 2026
