కుషాయిగూడ/ మల్కాజిగిరి, వెలుగు: చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మౌలాలి హౌసింగ్ బోర్డుకు చెందిన నల్ల రమేశ్(62) ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా కొనసాగుతూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఎ.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రూ.10 లక్షల చిట్టీ కట్టాడు. సుమారు 25 నెలల పాటు క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లించాడు. చిట్టీ గడువు ముగిసిన అనంతరం వెంకటేశ్వర్లుకు రావాల్సిన రూ.20 లక్షలకు రమేశ్ చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయింది. డబ్బులు చెల్లించాలంటూ పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో బాధితుడు జులై 7న జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనంతరం ఇదే తరహాలో మరికొందరు బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నల్ల రమేశ్ సుమారు 25 మంది నుంచి చిట్టీల పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టులోని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కం 10వ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 27న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు రమేశ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.
