
తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తెలుగు ట్రైలర్ వదిలారు మేకర్స్. 'కోబ్రా'కి రకరకాలుగా రూపాలు మార్చడం తెలుసు.. చాటుగా మాటేసి కాటేయడం తెలుసు' అనే వాయిస్ ఓవర్ పై ఈ ట్రైలర్ నడుస్తుంది. బయటికి ఓ సాధారణ మ్యాథ్స్ టీచర్ గా కనిపిస్తూ, 'కోబ్రా' తన పనులను చక్కబెడుతూ ఉంటాడనే విషయం ఈ ట్రైలర్ లో చూడవచ్చు. ఈ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిఫరెంట్ గెటప్స్ తో విక్రమ్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఆయనను పట్టుకునే ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ నటించాడు. ఏఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా శ్రీనిధి శెట్టి ఆడిపాడనుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రం నిర్మించారు. తెలుగులో ఎన్వీఆర్ సినిమా ద్వారా ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాని విడుదల చేయనున్నారు.