
హైదరాబాద్, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది.. దాన్ని పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని తెలిపారు. వాస్తవాలకు విరుద్ధంగా హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఎల్లంపల్లికి బీఆర్ఎస్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. దీన్ని తమ ప్రభుత్వమే నిర్మించినట్టుగా హరీశ్ రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నరని, కవిత విమర్శలకు సమాధానం చెప్పలేని హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావుకు దమ్ముంటే కవిత ఆరోపణలపై స్పందించాలని, ఆమె తప్పు మాట్లాడినట్లయితే కోర్టుకు పోవాలని సవాల్ విసిరారు. హరీశ్ రావు కాళేశ్వరం కహానీలను త్వరలోనే సీబీఐ తేల్చనుందని చెప్పారు.