BPL 2025: చివరి బంతికి ఆరు పరుగులు.. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన ఇంగ్లాండ్ ప్లేయర్.. వీడియో వైరల్

BPL 2025: చివరి బంతికి ఆరు పరుగులు.. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన ఇంగ్లాండ్ ప్లేయర్.. వీడియో వైరల్

చివరి బంతికి ఆరు పరుగులు అవసరం. ఈ దశలో ఒత్తిడంతా ఛేజింగ్ చేసే జట్టు మీదే ఉంటుంది. ఎంత స్టార్ బ్యాటర్ క్రీజ్ లో ఉన్నా ఒత్తిడి తట్టుకొని సిక్సర్ కొట్టడం అంత సామాన్యుమైన విషయం కాదు. చివరి బంతికి ఆరు పరుగులు చేస్తే గెలుస్తుంది అనుకున్న సమయంలో చాలా జట్లు సిక్సర్ కొట్టలేక మ్యాచ్ ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చరిత్రలో ఇలాంటి సందర్భాలు చూసుకుంటే వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతం చోటు చేసుకుంది. చివరి బంతికి సిక్సర్ కొట్టి ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్ తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. 

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం (జనవరి 20) రంగ్‌పూర్ రైడర్స్, సిల్హెట్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. 112 పరుగుల స్వల్ప ఛేజింగ్ లో సిల్హెట్ టైటాన్స్ తడబడింది. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. చివరి ఓవర్లో సిల్హెట్ విజయానికి 8 పరుగులు అవసరం. ఫహీమ్ అష్రఫ్ వేసిన ఇన్నింగ్స్ 20 ఓవర్లో మొయిన్ అలీ తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరమ 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 

క్రీజ్ లో వోక్స్, మొయిన్ అలీ ఉండడంతో సిల్హెట్ విజయం ఖారనుకున్నారు. ఈ దశలో మొయిన్ అలీ వరుసగా రెండు డాట్ బాల్స్ ఆడి ఆ తర్వాత బంతికి ఔటయ్యాడు. దీంతో చివరి రెండు బంతులకు 7 పరుగులు చేయాల్సి వచ్చింది. స్ట్రైకింగ్ లోకి వచ్చిన ఖలీద్ అహ్మద్ సింగిల్ తీసుకొని వోక్స్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. చివరి బంతికి ఆరు పరుగుకు చేయాల్సి రావడంతో మ్యాచ్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. అష్రాఫ్ వేసిన చివరి బంతికి వోక్స్ కవర్స్ దిశగా సిక్సర్ బాది జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. వోక్స్ కొట్టిన సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లీగ్ ఏదైనా చివరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించడంలో పిచ్చ కిక్ ఉంటుంది. వోక్స్ కూడా తమ జట్టుకు అలాంటి విజయాన్ని అందించాడు.