మెదక్ చర్చిలో మొదలైన క్రిస్మస్ వేడుకలు

మెదక్ చర్చిలో మొదలైన క్రిస్మస్ వేడుకలు
  • లక్ష మంది భక్తులు వస్తారని అంచనా
  • అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు  
  • 500 మందితో పోలీస్ బందోబస్తు
  • చీఫ్​ గెస్ట్​గా హాజరుకానున్న మాడరేటర్​ రూబెన్​ మార్క్

మెదక్, వెలుగు:  మెదక్‌ ‌చర్చిలో క్రిస్మస్‌ ‌వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన ఈ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్‌‌వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గురువారం ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని క్రిస్మస్‌‌వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్‌‌ఐ యంత్రాంగం, స్థానిక ఫాస్టరేట్‌‌ కమిటీ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 

మెదక్‌ ‌మహాదేవాలయంలో అత్యంత వైభవంగా జరిగే క్రిస్మస్‌ ‌వేడుకలను తిలకించి, బిషప్‌ ‌దైవ వాక్యాన్ని వినేందుకు, గురువుల దీవెనలు అందుకునేందుకు చర్చ్‌ ‌ఆఫ్‌ ‌సౌత్‌ ‌ఇండియా (సీఎస్ఐ) మెదక్‌ ‌డయాసిస్‌ ‌పరిధిలోని 13 జిల్లాలతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర  నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మొత్తం లక్ష మంది వరకు వస్తారని అంచనా. భక్తులెవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

మెయిన్‌‌రోడ్డు మీద ఉన్న గేట్‌‌నుంచి చర్చికి వెళ్లే మార్గంలో కేవలం భక్తులు మాత్రమే వెళ్లేలా బారికేడ్‌‌లు ఏర్పాటు చేశారు. చర్చి ప్రాంగణంలో తాగునీటి వసతి కల్పించారు.  లైట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు చర్చి ప్రాంగణంలో, పరిసరాల్లో, ట్రాఫిక్​ నియంత్రణ కోసం పట్టణంలోని చౌరస్తాలు, మెయిన్​ రోడ్డు, బస్టాండ్ వద్ద దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొబైల్​ పార్టీలను, క్యూఆర్టీ టీమ్​ లను నియమించారు.   

పశువుల పాక, క్రిస్మస్‌ ‌ట్రీ

క్రిస్మస్​ వేడుకల సందర్భంగా చర్చిని, ప్రాంగణాన్ని రంగు రంగుల లైట్లతో అలంకరించడంతో రాత్రి వేళ శోభాయమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఉత్సవాల సందర్భంగా చర్చి వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్‌ ‌తాత బెలూన్‌‌అందరిని ఆకట్టుకుంటోంది. ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్దతిలో పశువుల పాక ఏర్పాటుచేసి దానికి స్టార్‌ ‌వేలాడదీశారు. 

మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్‌ ‌ట్రీని ఏర్పాటుచేసి దానిని బెల్స్‌‌, స్టార్స్‌‌, గ్రీటింగ్‌ ‌కార్డ్స్​ రంగురంగుల బాల్స్​తో డెకరేట్‌ ‌చేశారు. చర్చిలోని ప్రధాన వేదిక, బిషప్‌ ‌ప్రసంగించే స్టేజీని, చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల కాగితాలు, బెలూన్‌‌లు, స్టార్‌‌లతో శోభాయమానంగా అలంకరించారు. 

తెల్లవారు జామునే.. 

గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మార్కింగ్‌ ‌సర్వీస్‌‌తో మెదక్‌ ‌చర్చిలో క్రిస్మస్‌ ‌మహోత్సవాలు ప్రారంభమవుతాయి. సీఎస్‌‌ఐ మాడరేటర్, మెదక్‌ ‌డయాసిస్‌‌ ఇన్​చార్జి బిషప్‌ ‌రైట్‌ ‌రెవరెండ్‌ ‌రూబెన్​ మార్క్​ చీఫ్​ గెస్ట్​ గా హాజరై‌ భక్తులకు దైవవాక్యాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత 10 గంటలకు జనరల్‌ ‌సర్వీస్‌‌ ఉంటుంది. ఆ తర్వాత రాత్రి వరకు భక్తులు చర్చిని దర్శించి గురువుల దీవెనలు అందుకుంటారు.