
జెన్కో నివేదిక కోసం వెయిటింగ్
కరోనా బారిన టెక్నికల్ టీం సభ్యులు
క్వారంటైన్ ముగిస్తేనే జాయింట్ రిపోర్ట్
ప్రభుత్వ అనుమతి తర్వాతే కేసు నమోదు చేసే చాన్స్
నాగర్‌కర్నూల్, వెలుగు: శ్రీశైలం పవర్‌ప్లాంట్ ప్రమాదంపై సీఐడీ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయింది. ఇప్పటికే అడిషనల్ డీజీకి అందజేసినట్లు తెలిసింది. మరోవైపు జెన్కో ఏర్పాటు చేసిన టెక్నికల్ టీం రిపోర్ట్ కూడా రెడీ అయితే రెండింటినీ కలిపి ప్రభుత్వానికి అందించేందుకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. కాగా, జెన్కో టెక్నికల్ టీం చైర్మన్, మరో మెంబర్ కు కరోనా సోకడంతో వారిప్పుడు హోం క్వారంటైన్లో ఉన్నారు. అది పూర్తయితేగానీ జెన్కో రిపోర్ట్బయటకు వచ్చే చాన్స్ లేదు. ఈ రెండు నివేదికల ఆధారంగానే ఇది ప్రమాదమా లేక మానవ తప్పిదమా అన్నదానిపై స్పష్టత వస్తుందని ఆఫీసర్లు అంటున్నారు. అనంతరం ప్రభుత్వ అనుమతి మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. సీఐడీ టీం ప్రాథమిక విచారణలో ఏం తేలిందనే విషయాన్ని ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఎంక్వైరీ టైంలో ఎక్కడ, ఎలాంటి లీకులకు వీల్లేకుండా స్థానిక పోలీసుల సహాయం తీసుకోకుండా ఉద్యోగుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. బ్యాటరీల సెక్షన్, ఎంసీఆర్, జీఐఎస్, జనరేటర్లు, ప్యానెల్స్, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించేటప్పుడు జెన్కో ఉద్యోగుల సాయం తీసుకున్నారు. సీఐడీ ఏర్పాటు చేసిన సైంటిఫిక్ ఫోరెన్సిక్, టెక్నికల్ టీంలు కాలిపోయిన స్పేర్‌పార్ట్స్ సేకరించారు. మున్ముందు దర్యాప్తులో అవసరమనుకున్న విడిభాగాలను మూటకట్టుకున్నారు.
ప్రభుత్వ నిర్ణయమే కీలకం..
పవర్‌ప్లాంట్ ప్రమాదం పూర్తిగా మానవ తప్పిదమేనని సంస్థ లోపల , బయట ఆరోపణలు వచ్చినా ఎవరూ నోరు విప్పకుండా కట్టడి చేయడంలో సంస్థ యాజమాన్యం సక్సెస్ అయ్యింది. మొదట్లో ఒకట్రెండు లీకులు బయటికి రాగానే ‘ఇంటిగుట్టు రట్టు చేస్తారా?’ అంటూ పెద్దసారు సీరియస్ అయ్యేసరికి మొదట్లో మాట్లాడిన గొంతులు సైలెంట్ అయ్యాయి. సీఐడీ రిపోర్ట్, జెన్కో టెక్నికల్ టీం ఇచ్చే రెండు రిపోర్టులపై జాయింట్‌గా చర్చించాక మానవ తప్పిదం ఉందనే యాంగిల్లో క్లూ దొరికితే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ప్రమాదమని కొట్టిపడేస్తే తదుపరి దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. దర్యాప్తు జరగాలంటే ముందు కేసు నమోదు చేసి ఆ తర్వాత చార్జిషీట్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. కేసు నమోదు, దర్యాప్తునకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నది ఇప్పట్లో తేలేలా లేదు. జెన్కో టెక్నికల్ టీం సభ్యులు హోం క్వారంటైన్ పూర్తి చేసుకోవడానికి మరో వారం పడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత జాయింట్రిపోర్ట్ రెడీ చేసి ఇచ్చినా.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
15 రోజుల్లో కరెంట్ వట్టిమాటే.. ఇప్పటికీ కొనసాగుతున్న క్లీనింగ్
శ్రీశైలం పవర్ హౌస్‌లో ప్రమాదం అనంతరం మాట్లాడిన జెన్కో ఎండీ ప్రభాకర్‌రావు 15 రోజుల్లో రెండు యూనిట్లను రెడీ చేసి కరెంటు ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రమాదం జరిగి 20 రోజులు కావస్తున్నా కరెంటు ఉత్పత్తి సంగతి దేవుడెరుగు అన్ని ఫ్లోర్లను క్లీన్ చేయడానికే మరో వారం పట్టేలా ఉంది. ప్రస్తుతానికి సర్వీస్ బే తో పాటు నాలుగు ఫ్లోర్లకు కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. బ్యాటరీలను పరిశీలిస్తున్నారు. ఫ్లోర్‌కు ఇరువైపులా 1200 హెచ్‌పీ కెపాసిటీగల 8 పంపులను ఏర్పాటు చేశారు. సీపేజ్ నీటిని తోడే వ్యవహారం తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. టర్బైన్లకు నీరందించే ఇన్‌టేక్ టన్నెల్ గేట్లను సకాలంలో మూసేశారు. అదే సమయంలో బటర్‌ఫ్లై వాల్వులు పనిచేయడంతో సీపేజ్ వాటర్ మిగిలిన ఫ్లోర్లకు చేరకుండా అడ్డుకోగలిగింది. సహజంగా జరగాల్సిన డీవాటరింగ్ ప్రక్రియ ఎందుకింత క్లిష్టంగా మారుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.