
తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజు కొనసాగుతోంది. సినిమా షూటింగ్స్ అన్ని పూర్తిగా బంద్ అయ్యాయి. తమ డిమాండ్ల విషయంలో ఇరు వర్గాలు పట్టువీడకపోవడంతో తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. ఈ సమస్యను ఇరువర్గాలు చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనతో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు భేటీ అయ్యారు. నిర్మాతలు బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, ఫిల్మ్ ఛాంబర్ నుంచి అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్నకుమార్, ఫెడరేషన్ నుంచి కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కార్మికుల వేతానాలు, వారి డిమాండ్లపై చర్చిస్తున్నారు. అటు చిన్న నిర్మాతల అభ్యంతరాలు, సమస్యలు, వేతానాలు ఎంత మేరకు పెంచాలని అనే దానిపై నిర్మాతలు తమ అభిప్రాయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
రోజువారి వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు విధించిన షరతులను ససేమిరా అంటున్నారు. ఈనేపథ్యంలో సోమవారం ( ఆగస్టు 11, 2025 ) ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఇరువర్గాలు పట్టువీడుపు వీడనాడాలని సూచించారు. సమస్యను పెద్దది చేయొద్దు, సమ్మెను విరమించాలని మంత్రి కోరారు. మీరు కొంచెం వేతనం పెంచండి, వాళ్లు కొంచెం తగ్గించుకుంటారు అనే రాజీ సూత్రాన్ని నిర్మాతలకు మంత్రి ప్రతిపాదించారు
ఈ రోజు జరిగే చర్చల్లోనైనా సానుకూల స్పందన వస్తుందని ఇరువర్గాలు భావిస్తున్నాయి. సమస్యను పెద్దది చేసుకోకుండా.. ఇరువురు ఒ మొట్టు దిగివస్తే మంచిదని అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో నిర్మాతలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.