ఎవ్వరు ఎక్కువిస్తే వాళ్ల షూటింగ్లకే

ఎవ్వరు ఎక్కువిస్తే వాళ్ల షూటింగ్లకే

వేతనాలు పెంచాలంటూ చేపట్టిన ధర్నాను సినీ కార్మికులు విరమించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు... కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు అడిగిన దానికంటే 12శాతం అధికంగా ఇస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తమకు ఛాంబర్ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని, కానీ ఒకవేళ పిలిస్తే వెళ్లి మాట్లాడతామని వారు తెలిపారు. కానీ షూటింగ్ లు ఆగకూడదనే సదుద్దేశంతో రేపటి నుండి ఎవరు మాకు ఎక్కువ వేతనం ఇస్తారో వల్ల షూటింగ్ లకు హాజరు అవుతామని ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫైటర్స్ అసోసియేషన్ సమస్య వుందని నిర్మాతలు అంటున్నారన్న ఆయన.. వారితో పాటు, అన్ని యూనియన్స్ తో మాట్లాడి సమస్య లు పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. మే డే రోజున కార్మికుల వేతనం పెంచాలి అని కోరామని.. కానీ ఛాంబర్ ప్రతినిధులు ఎవరూ రెస్పాండ్ కాలేదని తెలిపారు. మా సాదక బాధకాల గురించి 15 రోజుల ముందే లెటర్ రాశామన్న అనిల్... అయినా ఎలాంటి స్పందన లేదని, కష్ట పడ్డ కార్మికుల గురించి కూడా ఎవరూ మాట్లాడలేదని ఆరోపించారు. రేపటి నుంచి ఎవరైతే మేము అడిగిన పేమెంట్ ఇస్తారో వారికే పని చేస్తామని, తమకు తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి అండగా ఉంటామన్నారని అన్నారు. నిర్మాతలు ఎవరూ సంక్షోభంలో లేరన్న ఆయన.. పెద్దలు ఇప్పడుడిప్పుడే మాట్లాడుతున్నారని, చాలా మంది నిర్మాతలు  కాల్స్ చేస్తున్నారని,పేమెంట్స్ పెంచే  వారికే సినిమాలు చేస్తామని వల్లభనేని అనిల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాత సీ. కళ్యాణ్,  ఏఎమ్ రత్నం, మైత్రి మేకర్స్ రవి, సుప్రియ యార్లగడ్డ , జెమిని కిరణ్, భారత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

24 క్రాఫ్ట్స్ యూనియన్ల నాయకుల మీటింగ్

వేతనాలు పెంచాలని ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. యూనియన్ల వారీగా ఫెడరేషన్ కార్యాలయానికి తరలివస్తున్న సినీ కార్మికులను ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ అంశంపై ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో 24 క్రాఫ్ట్స్ యూనియన్ల నాయకులు మీటింగ్ నిర్వహించారు. సినిమా బడ్జెట్ లు, హీరోల రెమ్యూనరేషన్స్ పెరుగుతున్నా.. తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని సినీ కార్మికులు ఈ సమ్మెకు రెడీ అయ్యారు. 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్  కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునివ్వడమే కాకుండా... ఇవాళ్టి నుంచి సినిమా షూటింగ్ లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని గత కొంతకాలంగా నిర్మాతల్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ మూడేళ్లకోసారి వేతనాలు పెరగాలని వారు డిమాండ్ చేశారు. ఏ రోజుకారోజు ధరలు పెరుగుతున్నా.. నాలుగేళ్లైనా వేతనాల్లో ఎలాంటి మార్పూ లేదని సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.