పిట్ట కథలు, సినిమా డైలాగులు కేసీఆర్ కు అలవాటే

పిట్ట కథలు, సినిమా డైలాగులు కేసీఆర్ కు అలవాటే

యాగాలు చేయడం హిందూత్వం కాదు

మా ప్రచారం కేసీఆర్ మొదలుపెట్టారు

రైతుల చేతులకు బేడీలు వేసిన సీఎం కేసీఆర్

బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శలు

బీజేపీకి సానుకూలత పెరుగుతోందన్న కారణంగా సీఎం కేసీఆర్ పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. సీఎం గా కేసీఆర్ మాట్లాడేది భాషేనా అని ప్రశ్నించారు. ఆయన వాడుతున్న భాషను ఉపయోగించాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. మేం ప్రచారం మొదలుపెట్టకముందే కేసీఆర్ … బీజేపీ ప్రచారాన్ని మొదలు పెట్టారన్నారు. ఎలాంటి ప్రచారం చేసినా…ప్రజలు నరేంద్ర మోడీకి పట్టం కట్టడం ఖాయమన్నారు.

యాగాలు చేయడం హిందుత్వం కాదన్న కిషన్ రెడ్డి…ఉద్యమంలో బలిదానాలు చేసిన ఒక్క కుటుంబంతోనైనా కేసీఆర్ చర్చకు సిద్ధమేనా అని సవాల్ చేశారు. రైతుల చేతులకి బేడీలు వేసి జైలుకు పంపిన కేసీఆర్..రైతుల గురించి  బీజేపీ గూర్చి మాట్లాడుతారా? ఎర్రజొన్న రైతుల జీవితాల్లో ఏమైనా మార్పు తెచ్చారా? అంటూ ప్రశ్నించారు.

TRS పార్టీ ఫిరాయింపుల పార్టీగా మారడమే గుణాత్మక మార్పా అన్నారు. తెలంగాణ విమోచన దినం జరపడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధికి డబ్బు ఎక్కడినుండి వస్తోంది.. తెలంగాణ భవన్ లో ముద్రిస్తున్నారా అని అన్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే నీటి అవసరమే ఉండదని.. అసలు రిజర్వాయర్లు అవసరం లేకుండా మద్యాన్ని పారిస్తారన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో తెలంగాణలో మద్యం అమ్మకాలు జరిపించారని.. ఇది కేసీఆర్ తెచ్చిన గుణాత్మక మార్పన్నారు. ఓయూ దశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించలేని పార్టీ TRSదన్నారు. పోరాడి సాదించుకున్న తెలంగాణను అప్పుల తెలంగాణగా, ఫిరాయింపుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు.

పిట్ట కథలు, సినిమా డైలాగులు కేసీఆర్ కు అలవాటేనని.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్నారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. అంతేకాదు తెలంగాణ వచ్చాక జయశంకర్ ను, జేఏసీని కేసీఆర్ మర్చిపోయారన్నారని ఆరోపించారు. ఉన్న ఒక్క చక్రాన్ని ఎంతమంది తిప్పుతారని ప్రశ్నించారు.

ఒక్క రూపాయి కూడా మోడీ దుర్వినియోగం చేయలేదని…మోదీ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ‌పార్లమెంట్ సీటు వచ్చినా…రాకున్నా పార్టీ కోసం పని చేస్తానన్నారు.

సీటు రాలేదని పార్టీ మారే వ్యక్తిని కాదన్నకిషన్ రెడ్డి…. చివరి శ్వాశ వరకు బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.