అమల్లోకి సీఏఏ .. అసలు ఏమిటీ చట్టం?

అమల్లోకి సీఏఏ .. అసలు ఏమిటీ చట్టం?

 

న్యూఢిల్లీ :  లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం  మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్​విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది.  మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్​ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్​ నుంచి భారత్​కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్​ క్లియర్​ అయింది. 

  • ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్​సభలో ఆమోదం పొందింది.
  • ప్రతిపక్షాల నిరసనల మధ్య 2019 డిసెంబర్​ 11న ఈ బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి లభించింది.
  •  పాకిస్తాన్​, అఫ్గానిస్తాన్​, బంగ్లాదేశ్​లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి 
  • వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్​ 
  • మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం.
  • 64 ఏండ్ల కిందటి భారత పౌరసత్వ చట్టం –1955ను ఇది సవరించింది.
  • భారత పౌరసత్వం పొందేందుకు దేశంలో 11 ఏండ్లపాటు నివసించడంకానీ.. పనిచేసి ఉండాలనే నిబంధనలను సవరించింది. 
  • సీఏఏ ప్రకారం పాకిస్తాన్​, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్​కు చెందిన ముస్లిమేతర శరణార్థులు పౌరసత్వం పొందాలంటే ఆరేండ్లపాటు దేశంలో నివసించడం లేదా పనిచేసి ఉండాలి.
  • ఇందులో ముస్లింలను చేర్చకపోవడం వివాదానికి కారణమైంది.
  • ఇది రాజ్యాంగంలోని మానవులకు సమాన హక్కులు కల్పించే ఆర్టికల్​ 14ను ఉల్లంఘించడమేని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి.