రికార్డు స్థాయిలో 95శాతం రేషన్ పంపిణీ..మళ్లీ సెప్టెంబర్లోనే పంపిణీ

రికార్డు స్థాయిలో 95శాతం రేషన్ పంపిణీ..మళ్లీ సెప్టెంబర్లోనే పంపిణీ
  • మూడు నెలల కోటాను ఒకేసారి అందించిన సివిల్ సప్లయిస్ శాఖ  
  • గతంలో ఎన్నడూ 85% మించలే
  • హైదరాబాద్​లో 103%, మేడ్చల్​లో 113%, రంగారెడ్డిలో 110% అందిన రేషన్​
  • మళ్లీ సెప్టెంబర్​లోనే పంపిణీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేషన్ పంపిణీలో సివిల్ సప్లయ్స్ శాఖ రికార్డు సృష్టించింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్‌‌‌‌ను ఒకేసారి పంపిణీ చేసి.. 95 శాతం రేషన్‌‌‌‌ను విజయవంతంగా వినియోదారులకు అందించింది. గతంలో నెలవారీ పంపిణీలో ఎన్నడూ 85 శాతానికి మించని రేషన్ పంపిణీ.. ఈసారి ఒకే నెలలో మూడు నెలల కోటాను 95 శాతం పూర్తి చేసి చరిత్ర సృష్టించింది.

5.40 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ 

రాష్ట్రవ్యాప్తంగా 17,349 రేషన్​ షాపుల్లో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్​ పంపిణీ  చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 91.83 లక్షల రేషన్ కార్డుదారులకు 5.40 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున 5.72 లక్షల టన్నుల రేషన్‌‌‌‌ను సిద్ధం చేసినప్పటికీ, 95 శాతం అంటే 5.40 లక్షల టన్నులు 30 రోజుల్లో పంపిణీ పూర్తయింది. ఈ ప్రక్రియలో 2.65 కోట్ల ట్రాన్జాక్షన్లు నిర్వహించినట్టు సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్ తెలిపారు.

పలు జిల్లాలో 100 శాతం దాటిన రేషన్​ పంపిణీ..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందశాతానికి పైగా రేషన్​ పంపిణీ జరగగా మరికొన్ని జిల్లాల్లోని రేషన్​ షాపుల్లో 100 శాతం రేషన్​ పంపిణీ పూర్తయిందని అధికారుల పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో ఇతర పట్టణ ప్రాంతాలు,  గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లబ్ధిదారులకు రేషన్​ ఇస్తున్నారు. దీంతో హైదరాబాద్​ జిల్లాలో 103శాతం రేషన్​ పంపిణీ జరిగింది. మేడ్చల్​ జిల్లాలో 113 శాతం,  రంగారెడ్డి జిల్లాలో 110 శాతం రేషన్​ అందింది. ఇలా గతంలో నెల నెలా రేషన్​ అందించినా ఏనాడు 85 శాతానికి మించి రేషన్​ పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 18 జిల్లాల్లో 90 శాతానికి పైగా రేషన్ అందినట్టు అధికారులు వెల్లడించారు.

మళ్లీ సెప్టెంబర్ వరకు నో రేషన్

మూడు నెలల రేషన్ పంపిణీ రాష్ట్రంలో సోమవారంతో ముగిసింది. జూన్​, జులై, ఆగస్టు మూడు నెలల రేషన్​ను జూన్​ నెలలోనే పూర్తి చేసిన నేపథ్యంలో మళ్లీ సెప్టెంబర్​ వరకు రేషన్​ పంపిణీ  ఉండదని  సివిల్​ సప్లయ్స్​ అధికారులు స్పష్టం చేశారు. ఒకేసారి 5.40 లక్షల టన్నుల సన్న బియ్యం మూడు నెలల రేషన్ పంపిణీ చేయడంతో పాటు ఎక్కువ మంది లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేసింది. మూడు నెలల కోటా కేటాయింపుల్లో 5శాతం మినహా అందరికీ సివిల్ సప్లయ్స్ శాఖ రేషన్​ అందించడం గమనార్హం. 

టెక్నికల్​ సమస్యలు అధిగమించిన సివిల్​ సప్లయ్స్​..

రేషన్​ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పీఓఎస్) మెషీన్​లో 3 నెలల రేషన్​ ఒకేసారి ఇవ్వడం కోసం కొత్త సాఫ్ట్​వేర్​ను వినియోగించారు. రాష్ట్రంలో ఉన్న 91.83 లక్షల రేషన్​ కార్డుల్లో దీంతో ప్రతి నెలా సెంట్రల్​ కార్డులున్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు రెండు సార్లు వేలిముద్రలు సేకరిస్తారు.ఈ నెలలో మూడు నెలల రేషన్​ను ఒకేసారి ఇస్తుండడంతో ఒక్కో నెలకు రెండుసార్ల చొప్పున 3 నెలల రేషన్​కు ఆరు సార్లు వేలిముద్రలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సెంట్రల్​ కార్డులకు 6 సార్లు బయోమెట్రిక్​ తీసుకునే విధానాన్ని సరళీకరించి మూడింటికే పరిమితం చేశారు. దీంతో రేషన్​ పంపిణీ కొంత సులువైంది.  

పకడ్బందీగా రేషన్ పంపిణీ 

మూడు నెలల రేషన్​ ఒకే నెలలో పకడ్బందీగా పంపిణీ చేశాం. రోజు వారీగా ఎప్పటికప్పడు సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాం. మిల్లుల నుంచి సన్నబియ్యాన్ని తెప్పించి వెంట వెంటనే స్టాక్​ పాయింట్​లకు తరలించాం. అక్కడి నుంచి రేషన్​ షాపులకు చేర్చాం. మూడు నెలల కోటా కోసం 5.72 లక్షల టన్నులు సన్న బియ్యం సిద్ధం చేశాం. జూన్​ నెలాఖరు వరకు 5లక్షల 40వేల 893 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో రేషన్​ పంపిణీ చేశాం.  - డీఎస్​ చౌహన్, ప్రిన్సిపల్​ సెక్రటరీ  సివిల్ సప్లయ్స్ శాఖ