- 65 లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
- రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు
- స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ పై స్పెషల్ ఫోకస్
- బోనస్ కోసం అగ్రిస్టాక్ రైతు ఐడీ తప్పనిసరి
- ఆఫీసర్లతో సివిల్ సప్లయ్స్ కమిషనర్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారం నుంచే వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో 8,283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్ని జిల్లాల పౌరసరఫరాల అధికారులు, మేనేజర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి కేంద్రాల్లో వసతులు కల్పించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సన్న ధాన్యానికి రూ.500 బోనస్
ధాన్యం మద్దతు ధరకు అదనంగా సన్న రకం వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడు రకాల సన్న ధాన్యాలను గుర్తించింది. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 7715 రకాలకు బోనస్ అందుతుంది. బోనస్ పొందాలంటే రైతులకు అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘ఎస్‌హెచ్‌టీ’పై ప్రత్యేక దృష్టి
ధాన్యం కొనుగోళ్లలో కీలకమైన స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ (ఎస్‌హెచ్‌టీ) అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు రవాణా వాహనాలను సిద్ధం చేస్తున్నారు. గోదాముల కోసం వినియోగంలో లేని రైస్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, ఇతర ప్రత్యామ్నాయ నిల్వ కేంద్రాలను గుర్తిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తేమను కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలు( డ్రైయర్లు), టార్పాలిన్లు అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమైన గన్నీ బ్యాగులను ముందుగానే సమకూర్చుతున్నారు.
మిల్లులపై వారానికోసారి తనిఖీలు
మిల్లింగ్ లో అక్రమాలకు తావులేకుండా ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ) యాప్‌ను వాడనున్నారు. మండల, జిల్లా స్థాయి అధికారులు ఈ యాప్ ద్వారా రైస్ మిల్లుల్లో ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయడం, ధాన్యం లెక్కల్లో అక్రమాలకు పాల్పడడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించనున్నట్లు సివిల్ సప్లయ్స్ శాఖ హెచ్చరించింది.
నిబంధనలు ఉల్లంఘించే రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేసింది. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, మిల్లులకు ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ఆధారిత వీఎల్టీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేశారు.
