
- సందిగ్ధంలో సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్
- రేషన్లో సన్న బియ్యం పంపిణీతో గోడౌన్లలో మిగిలిన స్టాక్
- రూ.420 కోట్ల విలువజేసే లక్ష టన్నుల నిల్వలు
- జాప్యం చేస్తే ముక్కిపోయే ప్రమాదం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ ఊపందుకున్నప్పటికీ, గతంలో సేకరించిన లక్ష టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు గోదాముల్లో, రేషన్ దుకాణాల్లో మిగిలిపోయాయి. ఈ దొడ్డు బియ్యం నిల్వలను ఏం చేయాలనే దానిపై సివిల్ సప్లయ్స్ ఉన్నతాధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. దీంతో దొడ్డు బియ్యం నిల్వలపై సందిగ్ధం వీడడం లేదు. దాదాపు రూ.420 కోట్ల విలువైన ఈ బియ్యం నిల్వలను టెండర్ల ద్వారా విక్రయించే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో గత రెండు నెలలుగా దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో, గోదాముల్లో మూలుగుతున్నాయి.
రేషన్ షాపుల్లోనే 15 వేల టన్నులు
రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో 85 వేల టన్నులు, 17 వేల రేషన్ దుకాణాల్లో 15 వేల టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. కిలో రూ.42 చొప్పున సేకరించిన ఈ బియ్యం, టెండర్ల ద్వారా విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే, రెండు నెలలుగా ఈ నిల్వలపై విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడంతో బియ్యం ముక్కిపోయే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు చాలావరకు అద్దె గదుల్లో నడుస్తున్నాయి. ఇవి చిన్న గదుల్లో ఉండడంతో దొడ్డు బియ్యం నిల్వలతో ఇరుకుగా మారాయి.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, గదుల్లోకి నీరు చేరితే బియ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ కోసం కొత్త నిల్వలు వస్తుండగా, దొడ్డు బియ్యం ఖాళీ చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో స్థలం కొరత ఏర్పడింది. రానున్న జూన్ నెలలో మూడు నెలల సన్న బియ్యం కోటా సరఫరా కానున్న నేపథ్యంలో, నిల్వల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దొడ్డు బియ్యం నిల్వలను త్వరగా తొలగించాలని, లేకపోతే ఎలుకలు, లక్క పురుగులతో బియ్యం పాడై నష్టం వాటిల్లుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో దొడ్డు బియ్యం నిల్వలు ఎక్కడివి అక్కడే పేరుకుపోయాయి. గతంలో అక్రమంగా తరలించిన రేషన్ బియ్యం వేలం వేయకపోవడంతో ముక్కిపోయి, తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆలస్యమైతే ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను వెంటనే గోదాములకు తరలించి, టెండర్ల ద్వారా విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు, సమస్య తీరుతుందని సూచిస్తున్నారు.