మనం ఇతరుల మాటలు వినం.. పుణె యూనివర్సిటీలో సీజేఐ స్పీచ్

మనం ఇతరుల మాటలు వినం.. పుణె యూనివర్సిటీలో సీజేఐ స్పీచ్

పుణె/ న్యూఢిల్లీ: జీవితంలో ఇతరులు చెప్పే మాటలను మనం వినడంలేదని, మన సమాజంలో ఉన్న ప్రధాన సమస్య ఇదేనని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కేవలం మనసు చెప్పే మాటలనే కాకుండా, ఇతరులు చెప్పేది కూడా విన్నప్పుడే ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలమని అన్నారు. శనివారం పుణెలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్) యూనివర్సిటీలో జరిగిన 20వ కాన్వొకేషన్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సీజేఐ మాట్లాడారు. జీవితంలో ప్రతి దశలోనూ ఇతరుల మాటలు వినడం చాలా ముఖ్యమన్నారు. 

ఇతరుల నుంచి అన్ని సందర్భాల్లోనూ సరైన సమాధానాలే వస్తాయని చెప్పలేమని, కానీ ఆ మాటలను బట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొత్త విషయాలు తెలుస్తాయన్నారు. జీవితంలో ప్రతికూలతలను ఎదుర్కోవడమే అసలైన బలం, తెలివి అని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మంది సంపన్న జీవితాన్ని కోరుకుంటారని, అందులో తప్పులేదన్నారు. అయితే, ఆ జీవితం విలువలతో కూడినదై ఉండాలన్నారు. తాము యుక్త వయసులో ఉన్నప్పుడు ఎక్కువ ప్రశ్నలు వేసేందుకు భయపడేవారమని, కానీ ఇప్పుడు యువత నిర్భయంగా ప్రశ్నిస్తున్నారని మెచ్చుకున్నారు.

మంచి చేసేటోళ్లను వేధించొద్దు: ఢిల్లీ హైకోర్టు

ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారిని వేధింపులకు గురిచేయరాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మంచి చేసే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొన్న వారికి చట్టమే అండగా నిలవాలని పేర్కొంది. 2018లో ఓ రోడ్డు యాక్సిడెంట్​లో గాయపడిన వ్యక్తికి సాయం చేసేందుకు ఓ ట్రక్కు డ్రైవర్ వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనను మరో వెహికల్​ ఢీ కొట్టింది. దీంతో ట్రక్కు డ్రైవర్ చనిపోయాడు. ఆ డ్రైవర్ భార్యకు పరిహారం ఇచ్చే విషయమై నడుస్తున్న కేసులో హైకోర్టు జస్టిస్ ధర్మేశ్ శర్మ ఈ కామెంట్లు చేశారు. ట్రక్కు డ్రైవర్ కుటుంబానికి పరిహారం చెల్లించక్కర్లేదని లేబర్ కమిషనర్ ఇచ్చిన తీర్పును కొట్టేశారు. మధ్యంతర పరిహారం కింద ట్రక్కు యజమాని.. సదరు డ్రైవర్ భార్యకు రూ. 5 లక్షలు వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించారు.