జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఆస్తుల వివరాలు.. ఆయన బ్యాంకు అకౌంట్లో ఎంత డబ్బు ఉందంటే..

జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఆస్తుల వివరాలు.. ఆయన బ్యాంకు అకౌంట్లో ఎంత డబ్బు ఉందంటే..

భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్​ రామకృష్ణ గవాయ్(బి.ఆర్.గవాయ్) మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్​ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్న క్రమంలో సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న బి.ఆర్.గవాయ్ పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్ నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగనున్నారు.

తదుపరి సీజేఐగా మే 14న బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బి.ఆర్.గవాయ్​కు బ్యాంకులో రూ.19.63 లక్షల నగదు, రూ.5.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మహారాష్ట్రలోని అమరావతిలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబయిలోని బాంద్రా, న్యూఢిల్లీలోని డిఫెన్స్ కాలనీల్లో అపార్ట్​మెంట్లు, అమరావతి, నాగ్పూర్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన భార్య వద్ద రూ.29.70 లక్షల విలువైన ఆభరణాలు, రూ.61,230 నగదు డిపాజిట్లు ఉన్నాయి.

జస్టిస్ గవాయ్ 2019, మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.జస్టిస్ బి.ఆర్.గవాయ్ సీజేఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో 1960, నవంబర్ 24న జన్మించారు. నాగ్ పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు. 

జస్టిస్ బిఆర్ గవాయ్ 1992, ఆగస్టు నుంచి 1993, జులై వరకూ బాంబే హైకోర్టు నాగుర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా సేవలందించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ 2000, జనవరి 7న హైకోర్టు నాగ్​పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2005, నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.