
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ఖజురహో ఆలయ సముదాయంలో విష్ణువు విగ్రహా వివాదంపై సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్ క్లారిటీ ఇచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు.
అసలేం జరిగిందంటే..?
మధ్యప్రదేశ్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ఖజురహో ఆలయ సముదాయంలో ఏడు అడుగుల విష్ణువు విగ్రహ ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పునర్నిర్మించి, తిరిగి ప్రతిష్టించాలే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు.. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యమని అసహనం వ్యక్తం చేశారు.
ఖజురహో ఆలయం భారత పురాస్తు విభాగం(ఏఎస్‌ఐ) పరిధిలో ఉందని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేయడానికేమి లేదన్నారు. విగ్రహా పునర్మిణామంపై ఏఎస్ఐనే సంప్రదించడని సూచించారు. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారు కదా.. వెళ్లి ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహో ఆలయంలో అతిపెద్ద శివలింగం ఉంది.. అక్కడ కూడా మీరు దేవుడిని విన్నవించుకోవచ్చని పిటిషనర్‌ను ఉద్దేశిస్తూ సీజేఐ గవాయ్ వ్యాఖ్యానించారు.
వెళ్లి దేవుడినే అడుక్కోండి అంటూ సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజేఐ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. వెంటనే తన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగడంతో అప్రమత్తమైన సీజేఐ గవాయ్.. విష్ణువు విగ్రహా వివాదంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. తాను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు.