దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) 2026, జులై 24న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్‎కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని తమ మద్దతుదారులు, విద్యార్థులకు సూచించింది. 

నీట్ పేపర్ లీక్‎కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ దేశవ్యాప్తంగా పోలీసుల క్రూరత్వానికి గురైన బాధితులకు సంఘీభావం తెలిపేందుకు జులై 24న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినట్లు సీజేపీ తెలిపింది. నిరసనలకు అనుమతులు, ఏర్పాట్ల కోసం విద్యార్థి సంఘాలు, సీజేపీ బృందాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించింది. నిరసన కార్యక్రమంలో విద్యార్థులు తమ డిమాండ్లపై బిగ్గరగా గొంత్తెతాలని.. పోలీసుల క్రూరత్వానికి గురైన వారికి సంఘీభావం తెలిపాలని కోరింది.

ఆందోళనకారులు జై హింద్, భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ వంటి సానుకూల నినాదాలు మాత్రమే ఇవ్వాలని సూచించింది. ఏమి జరిగినా కూడా ఆందోళనకారులు శాంతియుతంగా, అహింసాయుతంగా ఉండాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రకటించినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం గమనార్హం. 

నీట్ 2026 పేపర్ లీక్ కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ 2026, జులై 20న పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీజేపీ చేపట్టిన ఈ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసుల బలప్రయోగంలో పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై పోలీసుల అమానుష దాడికి నిరసనగా సీజేపీ జులై 24న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.