Tirumala: తిరుమల క్యూ లైన్లో అపశ్రుతి.. ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు.. అసలేం జరిగిందంటే..

Tirumala: తిరుమల క్యూ లైన్లో అపశ్రుతి.. ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు.. అసలేం జరిగిందంటే..

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్లో భక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శనివారం సాయంత్రం క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళలను తోటి భక్తులు తోసి వేశారని భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భక్తులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు.

అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు ఒకరికి ఒకరు కొట్టుకోవడం జరిగింది. వెంటనే క్యూలైన్ వద్దకి విజిలెన్స్ అధికారులు చేరుకొని భక్తులను పక్కకు తీసుకెళ్లారు. ఆదివారం కావడం, పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో తిరుమలలో శ్రీవారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్నారు.

ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు కూడా ఐదు గంటలకు పైగానే దర్శనానికి నిరీక్షిస్తున్నారు. 3 వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని భక్తులు గమనించాలని అధికారులు చెబుతున్నారు.

వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని శనివారం ఒక్కరోజే 84వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం శనివారం ఒక్కరోజే రూ.4 కోట్ల 12 లక్షల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.