గుంజీల్లు తీస్తూ క్లాసులోనే చనిపోయిన 4వ తరగతి పిల్లోడు

గుంజీల్లు తీస్తూ క్లాసులోనే చనిపోయిన 4వ తరగతి పిల్లోడు

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థిని గుంజీలు తీయమని ఉపాధ్యాయుడు బలవంతం చేయడంతో.. ఆ బాలుడు మరణించాడు. రుద్ర నారాయణ్ సేథీ ఒరలిలోని సూర్య నారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి. నవంబర్ 21న పదేళ్ల విద్యార్థి మధ్యాహ్నం 3 గంటల సమయంలో పాఠశాల ఆవరణలో నలుగురు తోటి విద్యార్థులతో ఆడుకుంటూ కనిపించాడు. ఒక ఉపాధ్యాయుడు వారిని చూసి, వారికి శిక్షగా గుంజీలు తీయమని ఆదేశించాడు.

ఈ క్రమంలో రుద్ర కుప్పకూలిపోవడంతో రసూల్‌పూర్ బ్లాక్‌లోని ఓరాలి గ్రామంలో నివాసం ఉంటున్న అతని తల్లిదండ్రులకు వెంటనే ఘటన గురించి సమాచారం అందించారు. వారు, ఉపాధ్యాయులు అతన్ని సమీపంలోని కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు. అక్కడ్నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, చివరకు మంగళవారం రాత్రి కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై స్పందించిన రసూల్‌పూర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) నీలాంబర్ మిశ్రా.. తనకు ఇప్పటివరకు తమకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని చెప్పారు. తమకు అధికారికంగా ఫిర్యాదు అందితే, మేము విచారణను ప్రారంభిస్తామని, దోషులపై అవసరమైన చర్యలు తీసుకుంటామని అతను చెప్పాడు. అనంతరం రసూల్‌పూర్ అసిస్టెంట్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రవంజన్ పాఠశాలను సందర్శించి సంఘటనపై విచారణ ప్రారంభించారు.