ఫీజు కడితేనే క్లాసులు..  పరీక్షలు

ఫీజు కడితేనే క్లాసులు..  పరీక్షలు
  • ఐడీ, పాస్ వర్డ్ బ్లాక్ చేస్తున్న కాలేజీల మేనేజ్​మెంట్లు
  • ఇంటర్ స్టూడెంట్స్,   పేరెంట్స్​ లో ఆందోళన
  • కట్టిన వాళ్లకు అందని   పూర్తి మెటీరియల్
  •  వీకెండ్, మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్  సబ్జెక్ట్​ అర్థం కాక మానసికంగా కుంగిపోతున్న స్టూడెంట్స్​ 
  • ఫిజికల్ క్లాసులు  ప్రారంభించాలంటున్న టీపీజేఎంఏ

ఎస్ ఆర్​నగర్​లోని ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఎంఈసీ గ్రూప్​లో జాయిన్ అయ్యా .  మొదట్లో అడ్మిషన్ ఫీజు రూ.5 వేలు, మొత్తం ఫీజు 28 వేలు అని చెప్పారు. మూడు టర్మ్ ల్లో ఎప్పుడైనా ట్యూషన్​ ఫీజు కట్టొచ్చని చెప్పగా అడ్మిషన్ తీసుకున్నా.  ఆన్​లైన్​ క్లాసులకు జూమ్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చారు. మెటీరియల్ ఇవ్వలేదు. పదిరోజుల కిందట మెటిరియల్ కావాలంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలని చెప్పి,  ఆన్​లైన్ ​క్లాస్​లకు జూమ్​డిస్​కనెక్ట్​చేశారు. త్వరలో ఎగ్జామ్స్ కూడా కండక్ట్​చేస్తుండగా భయంగా ఉంది”. అని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రవి చెప్పాడు. 

“మా బాబు వారం రోజులుగా ఆన్​లైన్​క్లాసులు వినడం లేదు. ఏమైందని అడిగితే  ఫీజు కట్టమంటున్నారని చెప్పాడు.  అడ్మిషన్ టైంలోనే ఫీజు కట్టాం. అడ్మిషన్​ తీసుకునేంత వరకు నచ్చినప్పుడు  ఫీజు కట్టొచ్చని కాలేజీ మేనేజ్​మెంట్​చెప్పింది. ఇప్పుడేమో చెప్పాపెట్టకుండా క్లాసులు కట్ చేస్తున్నారు. ఇట్ల జేస్తరని అనుకోలేదు. ”అని ఇంటర్​ స్టూడెంట్ వెంకట్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్​జూనియర్ కాలేజీల మేనేజ్​మెంట్లు మొదట్లో స్టూడెంట్స్​ జాయిన్ అయితే చాలని.. ఫీజు ఎప్పుడైనా చెల్లించవచ్చని చెప్పి, అడ్మిషన్​ తీసుకున్నాక చుక్కలు చూపిస్తున్నాయి. ఫీజు కడితేనే క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ అంటూ స్టూడెంట్స్​, పేరెంట్స్​ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి.  జాయినింగ్​టైమ్​లో  అడ్మిషన్ ఫీజు మాత్రమే కడితే సరిపోతుందని స్టూడెంట్స్​ఇంటికి వెళ్లి మరి జాయిన్​ చేయించుకున్నాయి. మొత్తం ఫీజుని మూడు, నాలుగు టర్మ్​ల్లో  చెల్లించొచ్చని నమ్మించి, ఇప్పడు ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీలు జులై నుంచే ఆన్​లైన్​ క్లాసులు షురూ చేశాయి. మొదట్లో మేనేజ్​మెంట్లు అడ్మిషన్​ తీసుకున్న స్టూడెంట్స్ ను అందరిని ఆన్​లైన్​ క్లాసులకు అనుమతించాయి. ఐడీలు, పాస్ వర్డ్​లు ఇచ్చాయి. ఇప్పుడు మాట మార్చాయి. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కడితేనే క్లాసులు, మెటిరియల్ ఇస్తామని కరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్, పేరెంట్స్ ​ఆందోళనలో పడిపోయారు. మరో వైపు ఫీజు కట్టిన స్టూడెంట్స్​కు కూడా సగం మెటీరియల్​నే ఇస్తున్నాయి. ఆన్​లైన్ ​క్లాసులు సగం విన్నాక ఇప్పుడే బంద్​ చేస్తే ఎగ్జామ్స్ ఎలా రాయాలని టెన్షన్​ పడుతున్నారు. ఇదిలాగే ఉంటే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని, త్వరగా ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలని విద్యానిపుణులు, పేరెంట్స్​కోరుతున్నారు. వివిధ జాగ్రత్తలతో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభిస్తుంటే మన దగ్గర ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వం విద్యాసంస్థలను వెంటనే ఓపెన్​ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
ఫీజు కడితేనే.. మెటీరియల్ 
ఇంటర్​ స్టూడెంట్స్​కు​ స్టడీ మెటీరియల్ సమస్యలు తప్పడం లేదు. ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ ఇలా అన్ని గ్రూప్ ల వారికి ఇదే పరిస్థితి. కార్పొరేట్​ కాలేజీల మేనేజ్​మెంట్లు​మెటీరియల్​ని ప్రిపేర్ చేస్తున్నాయి. బయట మార్కెట్​లోవి వద్దని, తమ దగ్గరే తీసుకోవాలని మెసేజ్ లు పంపిస్తున్నాయి. పూర్తి ఫీజులో 20 నుంచి 40శాతం కట్టిన తర్వాత మాత్రమే ఇస్తామని కండీషన్​ పెడుతున్నాయి.  దీంతో స్టూడెంట్ల పేరెంట్స్​కు​ వేరే ఆప్షన్​ లేక ముందుగానే ఫీజులు చెల్లిస్తున్నారు. కాలేజ్ ఫీజు, మెటీరియల్​కి   3 నుంచి 5 వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టిన స్టూడెంట్స్​కు పూర్తిస్థాయి స్టడీ మెటీరియల్ ఇవ్వడంలేదు.  
 ఆన్​లైన్​ క్లాసులతో తీవ్ర ఒత్తిడి
ఆన్​లైన్​క్లాసుల కారణంగా స్టూడెంట్స్ మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ లు అర్థం కావట్లేదని స్టూడెంట్స్​ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఫిజికల్ క్లాసులు లేని కారణంగా స్టూడెంట్స్ , లెక్చరర్లకు మధ్య కమ్యూనికేషన్ ఉండడం లేదు. డౌట్స్​వస్తే స్టూడెంట్స్​లెక్చరర్లను అడగలేకపోతున్నారు.  తద్వారా మానసిక ఆందోళన ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలి. సెప్టెంబర్ లో విద్యాసంస్థల రీ ఓపెన్ అంటుండగా తేదీ  చెప్పడం లేదు. సర్కార్​ త్వరగా తేదీని ప్రకటించాలి.  
                                                                                                   –గౌరీ సతీష్,  ప్రెసిడెంట్,  తెలంగాణ జూనియర్ కాలేజ్ మేనేజ్​మెంట్​అసోసియేషన్