కాళేశ్వరం ప్రాజెక్టును మూసెయ్యాలె : ఆకునూరి మురళి

కాళేశ్వరం ప్రాజెక్టును మూసెయ్యాలె  : ఆకునూరి మురళి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : ప్రమాదకరంగా మారిన పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ను వెంటనే మూసెయ్యాలని సోష‌‌ల్ డెమోక్రటిక్ ఫోరం క‌‌న్వీన‌‌ర్, రిటైర్ట్‌‌‌‌ ఐఏఎస్​‌‌ ఆకునూరి మురళి డిమాండ్‌‌‌‌ చేశారు. సీఎం కేసీఆర్ హెచ్చులకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడని, ఈ ప్రాజెక్టు నిర్మాణంతో లక్ష కోట్లు గోదారి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మేడిగడ్డ బ్యారేజ్ లో మరిన్ని బ్లాకులు భూమిలోకి కుంగిపోతాయని మురళి హెచ్చరించారు. ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఓటు చైతన్య యాత్రలో భాగంగా జాగో తెలంగాణ పేరిట చేపట్టిన బస్సుయాత్ర బుధవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకు చేరింది. 

ఈ సందర్భంగా ఆయన మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండలంలో కుంగిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ పరిశీలించారు. అనంతరం రేగొండ, కాటారం మండలాలలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం కేంద్ర బిందువని, ఆయన అహంకార పూరిత వైఖరి కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఆరోపించారు. తానే ఇంజనీరుగా అవతారమెత్తి త్వరతగతిన పనులు పూర్తి చేయాలని పట్టు పట్టడం వల్లనే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఇంజనీర్లను తొందర పెట్టడం వల్లనే బ్యారేజీ నిర్మాణ పనులు సరిగా జరగలేదని అభిప్రాయపడ్డారు. 

రజత్ కుమార్, ప్రకాశ్​ లాంటి వారు కుంగిన బ్యారేజీని కళ్లతో చూసి ఆ తర్వాత ప్రాజెక్టు గురించి మాట్లాడాలని ఆయన సూచించారు.  సీఎం, మంత్రులు, ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్లు, ఇతర అధికారులు, బీఆర్ఎస్ నాయకులు మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.  గత పాలకుల కంటే సీఎం కేసీఆర్​ పాలనలో అవినీతి వంద రెట్లు పెరిగిందని ధ్వజమెత్తారు. ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. ప్రజలను అరిగోస పెడుతున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ పార్టీలను బొందపెట్టాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్​ వినాయక రెడ్డి, లక్ష్మినారాయణ, పద్మజా షా,రమ, గోవర్ధన్  తదితరులు పాల్గొన్నారు.