మహారాష్ట్ర నుంచి రాకుండా కామారెడ్డి బోర్డర్ మూసివేత

మహారాష్ట్ర నుంచి రాకుండా కామారెడ్డి బోర్డర్ మూసివేత
  • కామారెడ్డి జిల్లాను ఆనుకొని ఉన్న గ్రామాల్లో రోడ్లన్నీ క్లోజ్
  •  పలుచోట్ల అడ్డంగా కాల్వ తవ్వకాలు
  •  పక్క రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో మన అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నందున మరింత పకడ్బందీ చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లాను ఆనుకొని ఉన్న బార్డర్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎవరూ రాకుండా ఆఫీసర్లు ప్రజలను అప్రమత్తం చేసింది.

మహారాష్ట్రతో సంబంధాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు సరిహద్దులోని మహారాష్ట్ర ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బంధుత్వాలు, వ్యాపార, ఇతరాల కోసం నిత్యం ఇక్కడి నుంచి అక్కడకు, అక్కడి నుంచి ఇక్కడకు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కరోనా వైరస్ కట్టడికి సర్కారు లాక్ డౌన్ విధించింది. రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయ్యింది. ఆఫీసర్లు మెయిన్ రోడ్లను మూసేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జనాలు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

బార్డర్ పూర్తిగా బంద్

కామారెడ్డి జిల్లా సరిహద్దు వెంట ఉన్న మహారాష్ట్ర బార్డర్ ను పూర్తిగా క్లోజ్ చేశారు. జిల్లాలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, కోటగిరి తదితర మండలాల్లోని పలు గ్రామాలకు జనాలు మహారాష్ట్ర నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మద్నూర్, జుక్కల్లోని 13 గ్రామాల వెంట మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ఉంది. అయితే మహారాష్ట్ర బార్డర్ వెంట మన జిల్లా గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్లు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. మెయిన్రోడ్లు కాకుండా ఆయా గ్రామాల మీదుగా ఉన్న కచ్చా రోడ్లు, ఇతర రోడ్లన్నీ క్లోజ్ చేయించారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు కచ్చా రోడ్లకు అడ్డంగా కందకాలు తవ్వించారు. ఎలాంటి వాహనాలు వెళ్లకుండా చేశారు.

కట్టడి చేస్తున్న లోకల్ ఆఫీసర్లు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బార్డర్ క్లోజ్చేసిన ప్రాంతాల్లో కింది స్థాయి అధికారులు మరింత కట్టడి చేస్తున్నారు. జనం అధిక సంఖ్యలో కనిపించకుండా పర్యవేక్షిస్తున్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళా సమాఖ్య మెంబర్లను కూడా అలర్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి ఎవరైనా ఇక్కడికు వస్తే వారిని హోం క్వారంటైన్ లో ఉంచుతున్నారు. మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ మెయిన్ రోడ్డుతోపాటు, సిర్పూర్, ఇతర గ్రామాల రోడ్లు బంద్ చేయించారు. జిల్లాలో లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తూనే మరో వైపు బార్డర్లో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఆఫీసర్లను భాగస్వాములను చేశారు.

సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన ఆర్డీవో

మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ సోమవారం పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. మహారాష్ట్ర నుంచి ఏ మార్గంలోనూ జనం రాకుండా చూడాలని చెప్పారు. కొత్త వ్యక్తులు వస్తే ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మండల, గ్రామ స్థాయి యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించారు.

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా మంత్రిమండలి మీటింగ్ తర్వాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున అవసరమైతే మన రాష్ట్ర బార్డర్లు పూర్తిగా క్లోజ్ చేస్తామన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర వద్ద ఆఫీసర్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వెహికల్స్ రాకపోకలను పూర్తిగా బంద్ చేయించారు. అయినప్పటికీ సరిహద్దును ఆనుకొని ఉన్న ఆయా గ్రామాలకు పలువురు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆఫీసర్లు మరింత కఠిన తరం చేశారు.