
నిన్న శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్తర చెన్నై నగరం వరదలకు గురై, నగరంలోని చాల ప్రాంతాల్లో విద్యుత్ సప్లయ్ నిలిచిపోయింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సుమారు 180 నుండి 270mm వర్షపాతం నమోదైంది, మనాలి పట్టణంలో అత్యధికంగా 270mm వర్షపాతం నమోదవగా, న్యూ మనాలి టౌన్, విమ్కో నగర్‌లలో కూడా 260mm నుండి 230mm వర్షపాతం నమోదైంది. మాధవరం, పుళల్ సహా వ్యాసర్పాడిలో కూడా భారీ వర్షాలు కురిశాయి.
తక్కువ సమయంలోనే భారీ వర్షం కురవడంతో చాల ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సరైన డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టం లేకపోవడం, మురికినీటి కాలువలు ఒకదానికి ఒకటి కలపడంతో మురికినీటి కాలువలు పొంగిపొర్లి ఈ ప్రాంతాలు వేగంగా వరదల నీటికి గురవుతుందని అక్కడి నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం దాదాపు 30 చోట్ల మురికినీటి కాలువల అనుసంధానం పెండింగ్‌లో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పుళల్ వంటి ప్రాంతాల్లో మురికినీటి కాలువల కోసం కొత్తగా వేసిన రోడ్లను కూడా తవ్వారు.
వర్షాల కారణంగా చెన్నైలోని చాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉత్తర చెన్నైలోని మనాలి, రెడ్ హిల్స్, పుఝల్, వ్యాసర్పాడి, వాషర్‌మెన్‌పేట్, కెకెడి నగర్ ప్రాంతాలలో మూడు గంటలకు పైగా విద్యుత్ సప్లయ్ నిలిపివేసారు. ఆవడి, పట్టాభిరం, పల్లికరణై, కోయంబేడు, నుంగంబాక్కం, చూలైమేడులో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
ALSO READ : మా నాన్నపై CBI విచారణ వేస్తారా..
హై-టెన్షన్ 11KV లైన్‌లోని లోపం కారణంగా అంతరాయాలు ఏర్పడగా, రాత్రికి రాత్రే రిపేర్ చేశారు. తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDCL) కస్టమర్ సర్వీస్ యాప్ మిన్నగంలో శనివారం సాయంత్రం నుండి ఆదివారం వరకు దాదాపు 3,500 ఫిర్యాదులు వచ్చాయి.
మరోవైపు ఫ్రాన్స్, ఢిల్లీ, మంగళూరు నుండి చెన్నైకి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించడంతో విమానాలకు అంతరాయం ఏర్పడింది.