మా నాన్నపై CBI విచారణ వేస్తారా.. ఇదంతా హరీష్ రావు వల్లే జరిగింది : కవిత సంచలన కామెంట్స్

మా నాన్నపై CBI విచారణ వేస్తారా.. ఇదంతా హరీష్ రావు వల్లే జరిగింది : కవిత సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై ప్రభుత్వం సీబీఐ విచారణకు వెళ్లే ఛాన్స్ ఉందనే ఊహాగానాలతో.. హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. కేసీఆర్కు మరక అంటిందంటే హరీష్ రావు కారణం కాదా? అంటూ మండిపడ్డారు. హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలు చేశారని.. వీరి కారణంగానే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని సోమవారం (సెప్టెంబర్ 01) మీడియా సమావేశంలో విమర్శలకు దిగారు. 

కేసీఆర్ ఎప్పుడూ ఆస్తులు సంపాదించాలని అనుకోలేదని అన్నారు. ఈ వయసులో  కేసీఆర్ పై CBI విచారణ నా? ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే జరిగిందని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ అవినీతి కొండలని అన్నారు కవిత. వీళ్ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. 

హరీష్ రావు, సంతోష్ రావు లకు చెప్తున్నా..  కబడ్దార్ బిడ్డల్లారా?  నేను భయపడ. సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాస్తే ఊరుకోను.. అంటూ ఫైరయ్యారు కవిత. ఈ వయసులో కేసీఆర్ పై సీబీఐ విచారణ ఏంటంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

కేసీఆర్ పై సీబీఐ విచారణ అంటే ఏమిటి? పార్టీ లో ఉన్న దుర్మార్గుల్లారా! తెలంగాణ బంద్ కు పిలిపునిచ్చారా..? అంటూ మండిపడ్డారు. 

పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత..?

కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని  ప్రశ్నించారు కవిత. రెండో సారి అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని విమర్శించారు. హరీష్, సంతోష్ రావులు వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని అన్నారు. దమ్ముంటే హరీష్, సంతోష్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

నాపై కుట్రలు చేసినా సహించా..కానీ కేసీఆర్ పై ఆరోపణలు తట్టుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు కవిత. కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో చేశారని.. సీబీఐ కేసులు పెట్టే వరకు వస్తే పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని మండిపడ్డారు.