పోలీసుల్ని క్యాడర్ లా వాడుకుంటున్నారు

పోలీసుల్ని క్యాడర్ లా వాడుకుంటున్నారు

ఇప్పటి వరకు వనమ రాఘవను ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రభుత్వం ముందే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గతంలో వనమ రాఘవ కారణంగా ఓ వ్యాపారి సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. మొదట్లో చర్యలు తీసుకోకపోవడం వల్లే.. ఇప్పుడు నలుగురు ప్రాణాలు పోయాయన్నారు.  పాల్వంచ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని భట్టి డిమాండ్ చేశారు.  గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడానికి రామకృష్ణ ఆత్మహత్య ఓ ఉదాహరణ అన్నారు భట్టి. ఈ ప్రభుత్వం, పార్టీ.. పోలీసులే క్యాడర్ లా వాడుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల దగ్గరకు వెళ్తే రక్షణ ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో పోయిందన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 

ఆస్పత్రికి వెళ్లి రామకృష్ణ కూతురు చిన్నారిని కలిసానన్నారు. ఈ పాపను అయినా కాపాడుకుందామని ప్రభుత్వానికి చెప్పానన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకు వెళ్లాలని కోరానన్నారు. కానీ ఈ ప్రభుత్వం స్పందించ లేదన్నారు. కలెక్టర్, సీఎస్, అంతా ఒకేలా వ్యవహరిస్తున్నారన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎంకు డిమాండ్ చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఇంతవరకు నిందితుడి ఆచూకీ కనిపించకపోవడం ఏంటి ? అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందా లేదంటే... చెడిన రాజకీయ నేతల్ని,ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు పని చేస్తుందా అంటూ భట్టి మండి పడ్డారు. 

ఇవి కూడా చదవండి:

ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి

రానున్న రోజుల్లో 90 శాతం ఒమిక్రాన్ కేసులు